పాకిస్తాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఈ నెల 19వ తేదీ నుంచి సాగుతుంది. ఇప్పటికే ప్రధాన మ్యాచ్‌లు ముగిశాయి. ఈ టోర్నీలో భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి జట్లు మంచి ప్రదర్శనతో సెమీస్ రేసుకు చేరువయ్యాయి. గ్రూపు ఏ నుంచి భారత్, కివీస్ జట్లు ఇప్పటికే సెమీస్‌కు చేరగా, ఆతిథ్య పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు మాత్రం టోర్నీ నుంచి తప్పుకోనున్నాయి. ఈ రెండు జట్లలో పాకిస్థాన్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన జట్టుగా నిలిచింది. దీంతో ఆ జట్టు క్రికెటర్లపై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు జరిగే స్టేడియాలు, క్రికెటర్లు నివసించే నక్షత్ర హోటళ్లు, వారు ప్రయాణించే రోడ్డు మార్గాల్లో భద్రతకు నియమించిన వారిలో వంది మందికిపైగా భద్రతా సిబ్బంది విధులకు హాజరుకావడం లేదు.
ఈ విషయాన్ని పంజాబ్ ఐజీపీ ఉస్మాన్ అన్వర్ దృష్టికి వెళ్లడంతో సంబంధిత పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని ఆ అధికారి తెలిపారు. అంతర్జాతీయ కార్యక్రమాల కోసం భద్రత విషయంలో నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వరాదు అని ఐజీపీ పేర్కొన్నట్టు ఐసీసీ అధికారి వెల్లడించారు. కాగా, తొలగించిన పోలీసు సిబ్బంది తమకు కేటాయించిన అధికారిక విధులను నిర్వహించడానికి ఎందుకు నిరాకరించారనే దానిపై అధికారిక సమాచారం లేదు.
అయితే, అక్కడి స్థానిక మీడియా సమాచారం మేరకు సుధీర్ఘమైన పని గంటల కారణంగా ఒత్తిడి గురవుతున్నారని తెలిసింది. అందుకే వారు విధులకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికితోడు భారత్, న్యూజిలాండ్ జట్ల చేతిలో తమ జట్టు పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోవడాన్ని కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కారణాలతోనే భద్రతా సిబ్బంది విధులకు హాజరుకావడం లేదని తెలుస్తుంది.