భారత్ - ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య తొలి వన్డే శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. కరోనా మహమ్మారి కారణంగా గత మార్చి నుంచి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న భారత ... ఇపుడు అత్యంత పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుతో వన్డే సిరీస్‌తో శ్రీకారం చుట్టనుంది. అయితే, ఈ వన్డే మ్యాచ్‌లు ఖాళీ స్టేడియాల్లో నిర్వహించడంతో సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లో ఉండే వాతావరణం కనిపించలేదు.
సుదీర్ఘ పర్యటనలో భాగంగా శుక్రవారం మొదలయ్యే తొలి వన్డేతో ఇరు జట్ల వేట మొదలుకానుంది. ఈ సిరీస్‌కు అభిమానులను కూడా స్టేడియాల్లోకి అనుమతిస్తున్నారు. సిడ్నీలో జరిగే తొలి వన్డేకు 50 శాతం మాత్రమే నిండేలా ప్రేక్షకులను అనుమతించారు. 9 నెలల తర్వాత టీమిండియా ఆడనున్న తొలి అంతర్జాతీయ సిరీస్ కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
గత పర్యటనలో టెస్ట్ సిరీస్‌ను 2-1తో గెలిచి చరిత్ర సృష్టించిన కోహ్లి సేన.. ఈసారి కూడా అలాంటి అద్భుతం చేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఓపెనర్ రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల సిరీస్‌కు లేకపోవడం కాస్త లోటుగా కనిపిస్తోంది.
మోవైపు, రోహిత్ శర్మ లేకపోవడంతో శిఖర్ ధావన్‌తో కలిసి మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. మూడోస్థానంలో కోహ్లీ, నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో రాహుల్ బ్యాటింగ్‌కు దిగే ఛాన్సెస్ ఉన్నాయి.
ఈ సిరీస్‌లోనూ రాహులే వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇక బుమ్రా, షమి ఇద్దరూ తుది జట్టులో ఉంటే.. ఠాకూర్, సైనీలలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది. అటు స్పిన్నర్లలో చాహల్ లేదా కుల్‌దీప్‌లలో ఒకరిని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభంకానుంది.
ఇరు జట్ల అంచనా..
భారత్ : ధావన్, మయాంక్, కోహ్లి, అయ్యర్, రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా, శార్దూల్ ఠాకూర్/నవ్‌దీప్ సైనీ, కుల్‌దీప్/చాహల్, షమి, బుమ్రా.
ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ఫించ్, స్మిత్, లాబుషానె, స్టాయినిస్, అలెక్స్ కేరీ, మ్యాక్స్‌వెల్, కమిన్స్, స్టార్క్, జంపా, హేజిల్‌వుడ్.
ఇకపోతే, పిచ్ స్వభావాన్ని పరిశీలిస్తే, ఇటీవలి న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా సిరీస్‌ను బట్టి చూస్తే ఈ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదవడం ఖాయం. ఇక్కడ సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 312గా ఉంది. చివరి 7 మ్యాచ్‌లలో 6 మొదటి బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. దీంతో టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
రికార్డులు, గణాంకాలు
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాపై అద్భుతమైన రికార్డు ఉంది. వన్డేల్లో ఐదు సెంచరీలు సహా 50 సగటుతో 1154 పరుగులు చేశాడు. అయితే సిడ్నీ మాత్రం అతనికి కలిసి రాలేదు. ఈ గ్రౌండ్‌లో విరాట్ ఐదు ఇన్నింగ్స్‌లో కేవలం 9 సగటుతో పరుగులు చేశాడు.
అత్యధిక స్కోరు 21 మాత్రమే. అటు ఆస్ట్రేలియాకు ఈ గ్రౌండ్‌లో ఇండియాపై మంచి రికార్డు ఉంది. మొత్తం 14 గెలిచి కేవలం రెండింట్లో మాత్రమే ఓడిపోయింది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన చివరి నాలుగు వన్డేల్లో మూడు ఇండియానే గెలవడం కాస్త ఊరట కలిగించేది.