కరోనా కారణంగా అందరూ ఇంటికే పరిమితం అవుతున్నారు. అలాగే క్రికెటర్లు సైతం ఇంటి పట్టున గడుపుతూ.. తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కరోనా కారణంగా క్రీడలన్నీ వాయిదా పడడంతో ఇన్ని రోజులు ఇళ్లకే పరిమితమైన ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు.
ఇందులో భాగంగా రాంచీలోని తన ఫామ్‌హౌజ్‌కు పరిమితమైన టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సేంద్రీయ వ్యవసాయం చేయడం నేర్చుకుంటున్నాడు. ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నుతున్నాడు. అందుకు సంబంధించిన ఓ వీడియోను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పంచుకోడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో కాస్త వైరల్ అవుతోంది.
కాగా, ధోనీ ఇంతకుముందే ఓ వీడియోలో మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయం చేయడం తనకు ఇష్టమని, అది నేర్చుకుంటున్నానని చెప్పాడు. పుచ్చకాయలు, బొప్పాయిలు ఈ పద్ధతిలో ఎలా సాగుచేయాలో తెలుసుకుంటున్నట్లు తెలిపాడు.
ఈ నేపథ్యంలోనే ధోనీ వ్యవసాయ పనులు ప్రారంభించాడు. మరోవైపు గతేడాది నుంచీ టీమిండియాకు దూరమైన మాజీ సారథి ఎప్పుడు మళ్లీ జట్టులోకి వస్తాడనే విషయంపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే.