భారత యువ క్రికెటర్ కేఎల్ రాహుల్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తేరుకోలోని షాకిచ్చింది. జట్టు వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించింది. ప్రస్తుతం స్వదేశంలో భారత క్రికెట్ జట్టు పర్యాటక ఆస్ట్రేలియాతో గవాస్కర్ - బోర్డర్ టెస్ట్ సిరీస్‌ను ఆడుతోంది. ఇప్పటివరకు జరిగిన తొలి రెండు టెస్టుల్లో భారత్ విజయభేరీ మోగించింది. మరో రెండు టెస్టులు ఉన్నాయి. ఈ రెండు టెస్టుల కోసం బీసీసీఐ జాతీయ సెలెక్టర్లు తాజాగా జట్టును ప్రకటించారు.
ఈ జట్టుకు వైస్ కెప్టెన్సీ లేకుండానే ఆటగాళ్ల పేర్లను ప్రకటించారు. అయితే, కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించినప్పటికీ ఆయనకు జట్టులో చోటు కల్పించింది. ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్ళు అందుబాటులో ఉన్నప్పటికీ కేఎల్ రాహుల్‌కు జట్టు యాజమాన్యం పలు అవకాశాలు కల్పిస్తుంది. కానీ, రాహుల్ మాత్రం సరిగా నిలదొక్కుకోలేక పోతున్నారు.
దీంతో వైస్ కెప్టెన్సీ భారాన్ని అతనిపై నుంచి తొలగించింది. అదేసమయంలో ఆస్ట్రేలియాతో జరుగనున్న చివరి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు ప్రకటించిన జట్టుకు ఉపసారథి లేకుండా ప్రకటించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ పర్యటనలో ఛటేశ్వర్ పుజారా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇపుడు అతని పేరును కూడా బీసీసీఐ సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం.