దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలు మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఈ పోటీలను దృష్టిలో ఉంచుకుని క్రికెట్ అభిమానుల కోసం ప్రముఖ టెలికాం సంస్థ జియో ప్రత్యేకంగా రెండు డేటా ప్యాక్‌లను ప్రకటించింది. ఈ లీగ్ పోటీలను వీక్షించాలనుకునేవారికి ఇవి సరిగ్గా సరిపోతాయి! రూ.667, రూ.444తో వస్తున్న ఈ ప్లాన్లు కొంతకాలంగా యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. మ్యాచులను ఎంజాయ్ చేయాలనుకునేవారు వైఫై సదుపాయం లేకపోతే వీటిని పరిశీలించొచ్చు. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.
రిలయన్స్ జియో రూ.667 ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు. ఇది కేవలం డేటా వోచర్ మాత్రమే. ఇందులో వాయిస్ కాలింగ్, ఎసెమ్మెస్ వంటి ప్రయోజనాలేమీ ఉండవు. పైగా యాక్టివ్ బేస్ ప్లాన్ ఉంటేనే దీన్ని రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 150 జీబీ డేటా లభిస్తుంది. రోజువారీ పరిమితి ఏమీ ఉండదు. కావాలంటే మొత్తం ఒకేసారి వాడుకోవచ్చు. మరోవైపు రూ.444 ప్లాన్‌లో 100 జీబీ డేటా వస్తుంది. దీని వ్యాలిడిటీ 60 రోజులు. దీనికీ బేస్ ప్లాన్ ఉండాల్సిందే.
ఫోన్ లేదా ట్యాబ్లెట్‌లో ఐపీఎల్ చూడాలనుకునేవారు జియో సినిమా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఉచితంగానే మ్యాచులను వీక్షించొచ్చు. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. జియోయేతర కస్టమర్లు సైతం యాప్‌లోకి లాగిన్ అయ్యి లైవ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. పైన తెలిపిన రెండు ప్యాక్‌లతో పాటు జియోలో ఇతర డేటా ఆప్షన్లూ ఉన్నాయి. యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లో వాటి వివరాలు తెలుసుకోవచ్చు.