ఐపీఎల్ 2023 ఫైనల్ పోటీకి వరుణుడు అడ్డుపడ్డాడు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ ఆదివారం రాత్రి జరగాల్సివుంది. కానీ, భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఫైనల్ పోరు రిజర్వు డేకు మారింది. అహ్మదాబాద్‌లో సోమవారం కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఒకవేళ భారీ వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే ఐపీఎల్ 2023 టైటిల్ మాత్రం గుజరాత్ టైటాన్స్‌కే వరించనుంది. పాయింట్ల పట్టిక ఆధారంగా గుజరాత్ ఈ సీజన్ విజేతగా ప్రకటించనున్నారు.
రిజర్వు డే నాడు కూడా వర్షం కురిసి మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడినపక్షంలో ఓవర్లను కుదించి మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ మొదలవలవుతుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమైతే...
రాత్రి 9.45 గంటలకు లోపు మ్యాచ్ మొదలైతే 20 ఓవర్ల ఆట కొనసాగుతుంది. అప్పటికీ మ్యాచ్ ప్రారంభించే పరిస్థితి లేకుంటే రాత్రి 11.56 గంటలకు 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహిస్తారు. అప్పటికీ వర్షం ఆగకపోతే రాత్రి ఒంటి గంట వరకు వేచి చూస్తారు.
రాత్రి 1.20 గంటలకు వాతావరణం అనుకూలిస్తే సూపర్ ఓవర్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. అదీకూడా సాధ్యంకాని పక్షంలో పాయింట్ల పట్టిక ఆధారంగా గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా ప్రకటిస్తారు.