హరారే వేదికగా జరిగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వే జట్టు మరోమారు తడబడింది. భారత బౌలర్ల దెబ్బకు కేవలం 161 పరుగులకే కుప్పకూలింది. మొత్తం మూడు వన్డే మ్యాచ్‌లో ఈ సిరీస్‌లో ఇప్పటికే భారత్ జట్టు తొలి వన్డేలో పది వికెట్ల తేడాతో విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. శనివారం రెండో మ్యాచ్ ఇరు జట్ల మధ్య జరుగుతోంది.
ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 38.1 ఓవర్లలో 161 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టగా, శిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ హుడా, అక్షర్ పటేల్‌లో ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
జింబాబ్వే బ్యాట్స్‌మెన్లలో సీన్ విలియమ్స్ 42 రన్స్, రైన్ పర్ల్ 41 చొప్పున పరుగులు చేశారు. మిగిలిన ఆటగాళ్ళు క్రీజ్‌లో నిలదొక్కుకోలేక పోయారు. ఒక దశలో 21 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, విలియమ్స్, పర్ల్‌లు కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.
ఫలితంగా 38.1 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. దీంతో భారత్ ముంగిట 162 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 2.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది.