స్వదేశంలో పర్యాటక వెస్టిండీస్ జట్టుతో జరిగిన ట్వంటీ20 సిరీస్‌ను భారత క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ను 3-0 తేడాతో గెలుచుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన పాయింట్ల జాబితాలో భారత్ ఖాతాలో 269 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంది. దాదాపు ఆరేళ్ల తర్వాత భారత్ టీ20 ర్యాంకుల్లో మొదటి స్థానానికి చేరుకుంది. అంతకుముందు 2016లో ఫిబ్రవరిలో చివరిసారిగా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత్ అగ్రస్థానంలో నిలించింది.
ఇదిలావుంటే, స్వదేశంలో జరిగిన ట్వంటీ20 సిరీస్‌లలో భారత్ వరుసగా విజయాలను సాధిస్తుంది. గతంలో బంగ్లాదేశ్‌పై 2-1, వెస్టిండీస్‌పై 2-1, శ్రీలంకపై 2-0, ఇంగ్లండ్‌పై 3-2, న్యూజిలాండ్‌పై 3-0, వెస్టిండీస్‌పై 3-0 తేడాతో వరుసగా ఆరు సిరీస్‌లను భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఇదిలావుంటే, గురువారం నుంచి శ్రీలంక జట్టుతో స్వదేశంలో మరో ట్వంటీ20 సిరీస్‌ను ఆడనుంది.
మరోవైపు, ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 184 పరుగులుచేసింది. సూర్యకుమార్ మెరుపులు మెరిపించి 65 పరుగులు చేశాడు. ఆ తర్వాత 185 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఈ ట్వంటీ20 సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది.