భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు ట్వంటీ20లు, నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌కు స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ, ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మలు దూరమయ్యారు. వీరిద్దరూ గాయాల కారణంగా బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడెమీలో ఫిట్నెస్ కసరత్తులు చేస్తూ విశ్రాంతి తీసుకుంటున్నారు.
అయితే, పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు కనీసం 4 వారాలు పట్టే అవకాశమున్నట్లు సమాచారం. వచ్చే నెల 27 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య 4 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభంకానుంది. పరిమిత ఓవర్ల సిరీస్‌కు మాత్రమే ఎంపికైన శ్రేయస్ అయ్యర్‌ను టెస్టు సిరీస్‌కు రిజర్వ్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోంది.
'రోహిత్, ఇషాంత్ వచ్చిన తర్వాత ఏ ఒక్క కొత్త ఆటగాడు ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. ఈ కారణంగానే సెలెక్టర్లు ఇప్పటికే జంబో స్క్వాడ్‌ను ఎంపిక చేశారు. అవసరమైతే, శ్రేయాస్‌ను తిరిగి ఇక్కడే ఉండమని కోరనున్నట్లు' బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఇదిలావుంటే, రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతోనూ, ఇషాంత్ శర్మ పక్కటెముకల గాయంతో బాధపడుతున్నారు. ఈ కారణంగానే ఆస్ట్రేలియా టూర్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఐపీఎల్‌లో గాయపడిన రోహిత్.. వన్డే, టీ20 సిరీస్‌లకు మిస్ అయినా టెస్టులకు వెళ్తానని చెప్పాడు. అయితే టీమిండియా కోచ్ రవిశాస్త్రి మాత్రం.. మరో మూడు, నాలుగు రోజుల్లో రోహిత్ ఫ్లైట్ ఎక్కితేనే టెస్ట్ సిరీస్‌లో ఆడగలడని స్పష్టం చేశాడు.
కానీ, ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఈ ఇద్దరూ ఇప్పట్లో విమానం ఎక్కేలా లేరు. ఇటు ఎన్సీఏ నుంచి కానీ, అటు బీసీసీఐ నుంచి కానీ వీళ్ల ఫిట్నెస్ గురించి భారత క్రికెట్ జట్టు యాజమాన్యానికి ఎలాంటి సమాచారం అందలేదు.
ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన తర్వాత 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి. డిసెంబర్ 17వ తేదీన తొలి టెస్టు ప్రారంభంకానుంది. ఆ లెక్కన తొలి టెస్ట్‌కు వాళ్లు అందుబాటులో ఉండే అవకాశమే లేదు. కనీసం బాక్సింగ్ టెస్ట్‌లోనైనా ఆడాలంటే మూడు, నాలుగు రోజుల్లో విమానం ఎక్కాల్సిందే. అది కూడా సాధ్యపడేలా కనిపించడం లేదు.