నేడు చివరి వన్డే.. హోరాహోరీనే... గెలిస్తేనే కోహ్లీసేన నంబర్ వన్
స్వదేశంలో పర్యాటక ఆస్ట్రేలియాతో జరుగుతన్న ఐదు వన్డేల సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే 3-1 తేడాతో భారత జట్టు సిరీస్‌ను గెలుచుకోగా, ఆదివారం నాగపూర్ వేదికగా చివరి వన్డే మ్యాచ్ జరుగనుంది.
స్వదేశంలో పర్యాటక ఆస్ట్రేలియాతో జరుగుతన్న ఐదు వన్డేల సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే 3-1 తేడాతో భారత జట్టు సిరీస్‌ను గెలుచుకోగా, ఆదివారం నాగపూర్ వేదికగా చివరి వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది. ముఖ్యంగా.. ఈ మ్యాచ్ గెలుపు కోహ్లీ సేనకు అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత క్రికెట్ టీమ్, వన్డేల్లో తొలి స్థానానికి చేరుకుంటుంది.
వరుసగా మూడు మ్యాచ్‌లను గెలుచుకున్న తరువాత టీమిండియా నంబర్ వన్ స్థానాన్ని చేరుకున్నప్పటికీ, నాలుగో వన్డేలో ఓటమి తర్వాత తిరిగి రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు తొలి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా మూడో ప్లేస్‌లో ఉంది.
ఇక నేటి మ్యాచ్‌లో భారత్ గెలిచి 4-1 తేడాతో సిరీస్ విజయాన్ని నమోదు చేస్తే, తిరిగి తొలి స్థానానికి చేరుకుంటుంది. దీంతో ఓ కీలకమైన అగ్ని పరీక్ష ముందు కోహ్లీ సేన ఉన్నట్టే. కాగా, నాలుగో వన్డేలో ఓడిపోవడంతో, రిజర్వు బెంచ్ ఆటగాళ్ళకు మరోమారు నిరాశ ఎదురుకానుంది.
కాగా, జూలైలో వెస్టిండీస్‌తో నాలుగో వన్డేలో ఓడిన తర్వాత భారత్ వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. కొన్ని మ్యాచ్‌ల్లో అలవోకగా నెగ్గినా.. క్లిష్ట పరిస్థితులు ఎదురైన పోరుల్లో జట్టులో ఎవరో ఒకరు అండగా నిలవడంతో కోహ్లీసేన ప్రయాణం సాఫీగా సాగింది. కొన్ని విభాగాల్లో సమస్యలు ఉన్నా.. విజయాలు వస్తుండటంతో అవి పెద్దగా చర్చకు రాలేదు. కానీ, చిన్నస్వామిలో ఓటమితో లోపాలు బయట పడ్డాయి. రోహిత్, రహానే అంత గొప్ప ఆరంభం ఇచ్చినా.. జట్టు సద్వినియోగం చేసుకోకపోవడం శోచనీయం.
అదేవిధంగా చాలా రోజులుగా గెలుపు రుచి చూడని ఆసీస్ ఎట్టకేలకు విజయం అందుకోవడంతో ఆ జట్టుపై ఒత్తిడి తగ్గింది. మూడో వన్డేలో సెంచరీ చేసిన ఫించ్ బెంగళూరులోనూ చెలరేగిపోగా.. వార్నర్ ఫామ్‌లోకి రావడంతో ఆసీస్ టాపార్డర్ బలీయంగా మారింది. నాగ్‌పూర్‌లోనూ ఈ ఇద్దరూ కీలకం కానున్నారు. స్మిత్ విఫలమైనా.. చివర్లో హ్యాండ్స్‌కోంబ్, స్టొయినిస్ మెరుపులు మెరిపించి భారత బౌలర్లకు సవాల్ విసిరారు. ఇక, ఆరంభంలో విఫలమైన ఆసీస్ బౌలర్లు మ్యాచ్ నడుస్తున్న కొద్దీ మెరుగైన ప్రదర్శన చేశారు. కీలక సమయాల్లో వికెట్లు తీసి కోహ్లీసేనపై ఒత్తిడి పెంచారు. ఆఖర్లో అయినా.. భారత బ్యాట్స్‌మెన్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించారు.
జట్లు (అంచనా)
భారత్: రహానె, రోహిత్, విరాట్ (కెప్టెన్), మనీష్, కేదార్, ధోనీ (కీపర్), హార్దిక్, ఉమేష్, షమి, అక్షర్/కుల్దీప్, చాహల్
ఆస్ట్రేలియా: వార్నర్, ఫించ్, స్మిత్ (కెప్టెన్), హెడ్, వేడ్ (కీపర్), స్టొయినిస్, హ్యాండ్స్‌కోంబ్, కమిన్స్, కల్టర్‌నైల్, రిచర్డ్‌సన్, జంపా.
ఈ మ్యాచ్‌లో పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగి, విజయం సాధించాలని కోహ్లీ వ్యూహాన్ని రచిస్తున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఈ మ్యాచ్‌ని కూడా గెలిచి, సిరీస్‌లో తమ ఓటమి అంతరాన్ని తగ్గించుకోవాలని భావిస్తుండటంతో, మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయంగా మారింది.