బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందులో ఆసీస్ ఆటగాళ్లు ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101)లు సెంచరీలతో రాణించి జట్టు భారీ స్కోరు చేసేందుకు దోహదపడ్డారు. రెండో రోజు ఓవర్ నైట్ స్కోర్ 405/7తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ మరో 40 పరుగులు జోడించి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది.
ఈ మ్యాచ్ మొదట టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించిన విషయం తెలిసిందే. దాంతో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 117.1 ఓవర్లలో 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) శతకాలతో మరోసారి టీమిండియా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు.
అలాగే కీపర్ అలెక్స్ కేరీ అర్ధ శతకం (70) తో రాణించగా, ఉస్మాన్ ఖవాజా (21), ప్యాట్ కమిన్స్ (20) పరుగులతో ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లతో రాణించాడు. అలాగే సిరాజ్ 2 వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు.