Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళల ట్వంటీ20 వరల్డ్ కప్- సెమీఫైనల్‌కు వర్షం అడ్డంకి.. భారత్‌కు లాభమే

మహిళల ట్వంటీ20 వరల్డ్ కప్- సెమీఫైనల్‌కు వర్షం అడ్డంకి.. భారత్‌కు లాభమే
, గురువారం, 5 మార్చి 2020 (12:41 IST)
ఐసీసీ మహిళల ట్వంటీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా సెమీఫైనల్ మ్యాచ్ గురువారం జరుగనుంది. ఈ మ్యాచ్‌లోఆతిథ్య ఇంగ్లండ్ జట్టుతో భారత జట్టు సమరానికి సై అంటోంది. యువ ఓపెనర్ షెఫాలీ వర్మ భీకరమైన ఫామ్‌లో ఉండడం జట్టుకు ప్లస్ పాయింట్. అలాగే, జెమీమా రోడ్రిగ్స్‌ కూడా బాధ్యతాయుతంగా ఆడుతోంది. బౌలర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. 
 
స్పిన్నర్లు, పేసర్లు అద్భుతంగా రాణిస్తూ గ్రూప్‌ దశలో జట్టుకు విజయాలు కట్టబెట్టారు. కానీ సీనియర్‌‌ ప్లేయర్ల స్మృతి మంధాన, హర్మన్‌, వేదా కృష్ణ, ఆల్‌రౌండర్‌‌ దీప్తి శర్మ ఫామ్‌ అందుకోవాల్సి ఉంది. వీరు కనుక ఫామ్‌లోకి వస్తే.. అత్యంత కీలక మ్యాచ్‌లను సులభంగా కైవసం చేసుకోవచ్చు. 
 
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం అయినప్పటి నుండి భారత జట్టు ఒక్కసారి కూడా సెమీస్‌ దాటలేదు. 2018లో హర్మన్‌ప్రీత్‌ సేన ఇంగ్లాండ్‌తో సెమీస్‌లో ఢీకొని అక్కడి నుంచే నిష్క్రమించింది. ఇక ప్రస్తుత టోర్నీలో మాత్రం భారత్ హవా నడుస్తోంది. ఇప్పటికే వరుసగా నాలుగు లీగ్‌ మ్యాచ్‌ల్లో గెలిచి గ్రూప్‌-ఎలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం టోర్నీలో టైటిల్‌ ఫేవరెట్‌గా భారత్‌ ఉంది.
 
సెమీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తుచేసి తొలిసారి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరాలని హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన భావిస్తోంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో టీమిండియా అజేయంగా సెమీస్‌ చేరగా.. ఇంగ్లండ్‌ మాత్రం మూడు విజయాలతోనే ఇక్కడి వరకు వచ్చింది. అయితే వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్‌కు ఒక విషయం మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గెలిచిన నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ బౌలింగ్ బలంతో గట్టెక్కింది. బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం భారత్‌కు ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం వుంది. 
 
సిడ్నీ క్రికెట్‌ మైదానంలో మొదటగా భారత్‌-ఇంగ్లాండ్‌ తలపడనుండగా.. ఆ తర్వాత అదే వేదికపై దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు పోటీ పడనున్నాయి. అయితే సెమీస్‌ మ్యాచ్‌లకు వర్షం ముప్పు పొంచివుంది. వాతావరణ సమాచారం ప్రకారం.. సిడ్నీలో గురువారం 70 శాతం వర్షం కురిసే అవకాశం ఉందట. భారీగా వర్షం పడకున్నా.. మోస్తరు జల్లులు కురుస్తాయట. మోస్తరు జల్లులు మ్యాచ్‌లకు ఆటకం కలిగించవచ్చని సమాచారం. ఒకవేళ వర్షం అడ్డంకిగా మారితే.. భారత్‌, దక్షిణాఫ్రికా జట్లకు లాభం చేకూరనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవిత్ర గంగాస్నానం చేసిన సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం