ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ ప్రపంచ కప్ పోటీలు మే నెలలో జరుగనున్నాయి. ఈ పోటీల కోసం అన్ని క్రికెట్ దేశాలు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో పుల్వామా ఉగ్రదాడి జరిగింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారు. దీంతో భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
ఈ ప్రభావం ప్రపంచ కప్‌లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌పై పడింది. పుల్వామా దాడికి నిరసనగా పాకిస్థాన్ జట్టుతో భారత్ మ్యాచ్ ఆడరాదనే డిమాండ్లు పుట్టుకొచ్చాయి. పలువురు భారత క్రికెటర్లు కూడా పాక్‌తో క్రికెట్ సంబంధాలు తెంచుకోవాలని సలహా ఇచ్చారు.
ఈ నేపథ్యంలో భారత్ - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న సందిగ్ధత ఉంది. ఈ నేపథ్యంలో ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్‌సన్ మాట్లాడుతూ, ప్రపంచ కప్‌లో పాల్గొనే అన్ని దేశాలు ఐసీసీ నిబంధనలకు కట్టుబడివుంటాయమే సంతకాలు చేశాయి.
జూన్ 16వ తేదీన ఇండోపాక్ మ్యాచ్ నిర్వహణ, భద్రత అంశాలపై తనకెలాంటి అనుమానం లేదన్నారు. ఒకవేళ ఏదేని కారణంతో మ్యాచ్ ఆగితే మాత్రం ఇరు జట్లకు పాయింట్లను సమానంగా వస్తాయన్నారు. ఒకవేళ మ్యాచ్‌ను భారత్ ఆడకపోతే పూర్తి పాయింట్లూ పాకిస్థాన్‌కు వెళతాయని ఆయన చెప్పారు. దీంతో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌పై అపుడే బెట్టింగ్స్ ఆరంభమయ్యాయి.
పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఉగ్రవాద సంబంధం కలిగిన దేశాలను(పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండ) ఐసీసీ నుంచి బహిష్కరించాలని కోరుతూ బీసీసీఐ పాలక కమిటి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు లేఖ రాసింది. అలాగే, పాక్ బోర్డు సైతం.. భారత్-ఆసీస్ మధ్య జరిగిన మూడో వన్డేలో భారత ఆటగాళ్లు ఆర్మీ క్యాపులను ధరించి ఆడటంపై అభ్యంతరం తెలుపుతూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.
ఈ విషయాలపై స్పందించిన డేవ్‌రిచర్డ్‌సన్.. పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన జవాన్ల గౌరవార్థం, బాధితులకు విరాళాలు సేకరించేందు కోసం.. భారత ఆటగాళ్లు ఆర్మీ క్యాపులు ధరించేందుకు అనుమతి పొందారని చెప్పారు. క్రికెట్‌కు రాజకీయాలను ఆపాదించడం ఐసీసీ ఉద్దేశం కాదని ఆయన తేల్చిచెప్పారు.