టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలోని ఓ లోక్‌సభ స్థానం నుంచి గంభీర్ పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం నచ్చి తాను బీజేపీలో చేరానని.. ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఇకపోతే.. 2011 వరల్డ్ కప్‌లో టీమిండియా విజేతగా నిలవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించారు. అంతకుముందు 2007లో టీ20 వరల్డ్ కప్ విజయంలోనూ గంభీర్ పాత్ర మరవలేనిది. ఇటీవలే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. సోషల్ మీడియాలోనూ చలాకీగా ఉండే గంభీర్.. దేశ ఆర్మీకి సంబంధించిన అంశాలపై ఏమాత్రం జంకు లేకుండా కామెంట్స్ చేస్తారు.
పుల్వామా దాడి అనంతరం రానున్న వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టుతో టీమిండియా క్రికెట్ ఆడాలా వద్దా అనే అంశంపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాక్‌తో మ్యాచ్ ఆడొద్దని.. ఆడకపోతే రెండు పాయింట్లు మాత్రమే పోతాయని, అమర జవాన్ల ప్రాణాలకన్నా.. క్రికెట్ ఎక్కువేం కాదని గంభీర్ ఇటీవల వ్యాఖ్యానించారు.
ఇకపోతే.. రానున్న వరల్డ్ కప్‌లో కోహ్లీ సేన ధీటుగా రాణించాలని వ్యాఖ్యానించారు. ఈసారి వరల్డ్ కప్ గెలవడం కోహ్లీ టీమ్‌కు అంత సులభమేమీ కాదని కూడా వ్యాఖ్యానించారు. అలాగే ఐపీఎల్ గెలుపు విషయంలోనూ గంభీర్ కామెంట్స్ చేశారు.
ఐపీఎల్ టైటిల్‌ను ఒక్కసారి గెలవకపోయినా ఆర్సీబీ యాజమాన్యం కోహ్లీని కెప్టెన్సీగా కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ గంభీర్ ట్విట్టర్‌లో కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కోహ్లీ ధీటుగా స్పందించారు. ఐపీఎల్ టైటిల్‌ను గెలవాలని తాను కూడా కోరుకుంటున్నాను. ఇందుకుగాను అన్నీ ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పాడు. అయితే కేవలం ఐపీఎల్ టైటిల్ గెలిచానా లేదా అన్న విషయంపై నన్ను జడ్జ్ చేయడం ఏమాత్రం సరైంది కాదని బదులిచ్చాడు కోహ్లీ.