భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి 2019 సంవత్సరం బాగా కలిసివచ్చిందని చెప్పొచ్చు. ఈ యేడాదిలో ఆయన పరుగుల వరద పారించాడు. ముఖ్యంగా, 110.57 సగటుతో ఏకంగా 774 పరుగులు చేశాడు. ఫలితంగా ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచాడు. ఫలితంగా ఆయన 2019 సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలకనున్నాడు.
ఐసీసీ టెస్ట్ ర్యాంకులను తాజాగా వెల్లడించారు. ఇందులో బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ వరుసగా రెండో ఏడాది అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఫలితంగా ఈ ఏడాదిని ఘనంగా ముగించినట్టు అయింది. 928 పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో నిలవగా, ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
అలాగే, బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో జట్టులో చోటు కోల్పోయి ఏడాది తర్వాత జట్టలో చేరిన స్మిత్.. యాషెస్ సిరీస్‌లో పరుగులు వరద పారించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ సిరీస్‌లో స్మిత్ నాలుగు మ్యాచుల్లో 110.57 సగటుతో ఏకంగా 774 పరుగులు చేశాడు. దీంతో టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి ఎగబాకి కోహ్లీని కిందికి నెట్టేశాడు.
అయితే, స్వదేశంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లీ అద్భుతంగా రాణించడంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అదేసమయంలో పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో స్మిత్ పేలవ ప్రదర్శన కారణంగా దిగువకు పడిపోయాడు. అయితే, న్యూజిలాండ్ సిరీస్ రూపంలో స్మిత్‌కు మరోమారు కోహ్లీని దాటే అవకాశం వచ్చినా అంతగా రాణించలేకపోయాడు. కివీస్‌తో ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో 37.75 సగటుతో 151 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు.