భారత క్రికెట్ జట్టులో చోటు కోసం తాను ఎదురు చూడటం లేదని హార్దిక్ పాండ్యా అన్నారు. గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తున్న హార్దిక్ ఇటు బ్యాటు, అటు బంతితో రాణిస్తున్నారు. దీంతో హార్దిక్ పాండ్యాకు తిరిగి జట్టులో చోటు దక్కుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీటిపై హార్దిక్ పాండ్యా స్పందించారు.
ఇపుడు భారత జట్టులో చోటు గురించి ఆలోచన చేయడం కంటే ఆటపైనై దృష్టి పెట్టానని చెప్పారు. "నేను జట్టులోకి తిరిగి వస్తున్నానని అనుకోవడం లేదు. అస్సలు దాని గురించి నేను ఆలోచన చేయడం లేదు. ప్రస్తుతం నేను ఆడే గేమ్‌పైనే దృష్టి పెడుతున్నా" అని అన్నారు.
ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్నానని అందువల్ల తన దృష్టంతా ఇపుడు దానిపైనే ఉందని చెప్పారు. ఆ తర్వాత తన భవిష్యత్ ఎక్కడికెళుతుందో వేచి చూడాల్సిందేనని చెప్పారు. అది తన చేతుల్లో లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి తాను ఆడుతున్న జట్టు కోసం మాత్రమే తన దృష్టిని కేంద్రీకరిస్తానని పేర్కొన్నారు.
ఆటతీరుపరంగా చాలా సంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. తన ఆట మెరుగవ్వడంలో కెప్టెన్సీ ఎంతో ఉపకరించిదని వివరించాడు. బాధ్యతలను తీసుకునేందుకు ఇష్టపడే క్రికెటర్ అని తెలిపాడు. ఆటను బాగా అర్థం చేసుకున్నపుడే విజయం సాధించగలమని హార్దిక్ పాండ్యా సెలవిచ్చారు.