ముంబై వేదికగా డీవై పాటిల్ ట్వంటీ20 టోర్నీ జరుగుతోంది. ఇందులో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పగటిపూటే బౌలర్లకు చుక్కలు చూపిస్తా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఫలితంగా కేవలం 55 బంతుల్లోనే 158 పరుగుల చేసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
డీవై పాటిల్ ట్వంటీ20 టోర్నీలో భాగంగా శుక్రవారం బీపీసీఎల్ జట్టుతో రిలయన్స్-1 టీమ్ తలపడింది. ఇందులో రిలయన్స్ టీమ్-1కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.
ఇటీవలే కాగ్ జట్టుపై 39 బంతుల్లో 105 పరుగులు చేసిన పాండ్య, శుక్రవారం కూడా బీపీసీఎల్ జట్టుపై ఏకంగా 55 బంతుల్లో అజేయంగా 158 పరుగులు సాధించాడు. ఈ స్కోరులో 20 సిక్సర్లున్నాయంటే పాండ్య ఊచకోత ఏవిధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
భారత ప్రధాన జట్టులో ప్రధాన ఆల్‌రౌండర్‌గా ఉన్న హార్దిక్ పాండ్య గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇపుడు గాయం నుంచి కోలుకున్న హార్దిక్... పూర్తి ఫిట్నెస్ సాధించి అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ముఖ్యంగా, స్వదేశంలో ఐపీఎల్ టోర్నీ ప్రారంభంకానుంది. ఈ టోర్నీకి ముందు హార్దిక్ మెరుపుదాడులు క్రికెట్ పండితులను విస్మయానికి గురిచేస్తున్నాయి.