భారత క్రికెట్ క్రికెటర్ యుజువేంద్ర చాహల్, ఆయన భార్య ధనశ్రీలు విడిపోయారు. వీరికి ముంబైలోని బాంద్రా కోర్టు గురువారం అధికారికంగా విడాకులు మంజూరుచేసింది. ఈ మేరకు చాహల్ తరపు న్యాయవాది నితీశ్ కుమార్ గుప్తా మీడియాకు వెల్లడించారు. అయితే, ఈ విడాకుల ఖరీదు రూ.4.75 కోట్లు. ఈ మొత్తాన్ని ధనశ్రీకి ఇచ్చేందుకు చాహల్ అంగీకరించారు.
ఇదే అంశంపై చాహల్ న్యాయవాది మాట్లాడుతూ, ముంబై ఫ్యామిలీ కోర్టుకు వచ్చిన ధనశ్రీ వర్మ, చాహల్ వారు తమ విడాకుల తుది పత్రాల ప్రక్రియను పూర్తి చేశారు. ధనశ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లు ఇచ్చేందుకు చాహల్ అంగీకరించాడు అని తెలిపారు.
కాగా, ఈ దంపతులకు గత 2020లో వివాహం కాగా, గత కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. వీరికి గురువారం కోర్టు విడాకులు మంజూరు చేయడంతో అధికారికంగా విడిపోయారు.
చాహల్ ఐపీఎల్ టోర్నీలో పాల్గొనాల్సివున్నందున ఈ విడాకుల కేసులో గురువారం తుది తీర్పును ఇవ్వాలని కింది కోర్టును ముంబై హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ జంటకు విడాకులు మంజూరు చేస్తూ తుది తీర్పును వెలువరించారు.
ఇదిలావుంటే, చాహల్ పంజాబ్ కింగ్స్ జట్టు తరపున బరిలోకి దిగుతున్నాడు. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడాడు. ఈ సీజన్‌కు పంజాబ్ జట్టు రూ.18 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.