Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబైలో గుండెపోటుతో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డీ జోన్స్ కన్నుమూత

ముంబైలో గుండెపోటుతో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డీ జోన్స్ కన్నుమూత
, గురువారం, 24 సెప్టెంబరు 2020 (16:45 IST)
ముంబైలోని ఓ హోటల్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డీ జోన్స్ కన్నుమూశారు. సహచరులతో మాట్లాడుతున్న సమయంలో ఆయనకు ఛాతి నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఆయన వయసు 59 యేళ్లు. ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ కోసం డీ జోన్స్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
ఐపీఎల్ పోటీలు యూఏఈలో జరుగుతున్నప్పటికీ.. ముంబైలోని స్టార్ స్పోర్ట్స్ స్టూడియోలో కామెంట్రీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా జోన్స్ స్టార్ స్పోర్ట్స్ వ్యాఖ్యాతల బృందంలో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నారు. కాగా, దక్షిణ ముంబైలోని ఓ హోటల్ కారిడార్‌లో ఇతర సహచరులతో ముచ్చటిస్తున్న ఆయన ఉదయం 11 గంటల సమయంలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. 
 
ఆపై మరి లేవలేదు. వెంటనే అంబులెన్స్‌లో హరికిషన్ దాస్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. జోన్స్ మృతి చెందిన సమాచారాన్ని ఆస్ట్రేలియాలోని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కాగా, జోన్స్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించే అవకాశాలున్నాయి.
 
మరోవైపు, డీన్ జోన్స్ ఆస్ట్రేలియా క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 80, 90వ దశకాల్లో అనేక వీరోచిత ఇన్నింగ్స్‌లతో ఆస్ట్రేలియాకు ఎన్నో విజయాలు అందించారు. 1984లో టెస్ట్ కెరీర్ ఆరంభించిన జోన్స్ 52 మ్యాచ్‌లు ఆడి 11 సెంచరీలు, 14 అర్థ సెంచరీలతో 3,631 పరుగులు చేశాడు. ఆయన సగటు 46.55 శాతం. 
 
ఇక వన్డేల్లో 164 మ్యాచ్‌లు ఆడి 7 సెంచరీలు, 46 అర్థ సెంచరీలతో 6,068 రన్స్ నమోదు చేశాడు. జోన్స్ ఆడిన చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లలో నాటి మద్రాస్ టెస్టులో సాధించిన డబుల్ సెంచరీ ఒకటి. 1986-87 సీజన్‌లో భారత పర్యటనకు వచ్చిన ఆసీస్ మద్రాస్‌లో టెస్టు మ్యాచ్ ఆడింది. 
 
విపరీతమైన వేడి వాతావరణాన్ని తట్టుకుని నిలబడిన జోన్స్ 210 పరుగులు సాధించాడు. డీహైడ్రేషన్ పరిస్థితి వచ్చినా జట్టు కోసం బ్యాటింగ్ కొనసాగించాడు. బ్యాటింగ్ ముగియగానే హాస్పిటల్‌కు వెళ్లి సెలైన్ కట్టించుకున్నాడు. 
 
జోన్స్ పోరాట పటిమకు నిదర్శనంగా నిలిచే ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అటువంటి జోన్స్ మరణంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లోనే కాదు, ప్రపంచ క్రికెట్ రంగంలోనూ విషాదం నెలకొంది. ఆ ఆసీస్ దిగ్గజం ఇక లేరన్న వార్తతో ఆయనతో అనుబంధం ఉన్న మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. 
 
'ప్రొఫెసర్‌ డీనోగా పేరుగాంచిన విక్టోరియా బ్యాట్స్‌మన్‌ జోన్స్‌ ఓపెనర్‌గా ఎటాకింగ్‌ బ్యాటింగ్‌ స్టైల్‌తో అలరించాడు. 245 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన జోన్స్‌ 19,188 రన్స్‌ సాధించడం విశేషం. మెల్‌బోర్న్‌లో జన్మించిన జోన్స్‌.. ప్రపంచవ్యాప్తంగా తన కామెంటరీతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. భారత మీడియా రంగంలోనూ ఆయన ప్రముఖ వ్యక్తిగా ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీ తప్పులతోనే సీఎస్కే రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది.. సెహ్వాగ్