చాంపియన్ ట్రోఫీ : ఫైనల్‌లో పాకిస్థాన్.. సొంతగడ్డపై చిత్తుగా ఓడిన ఇంగ్లండ్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, కార్డిఫ్ వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్ చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఐసీసీ వన్డే ట్రోఫీ నెగ్గాలనే ఇంగ్లండ్ చిరకాల స్వప్నం మరోసారి భగ్నమైంది. అనిశ్చితికి మా
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, కార్డిఫ్ వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్ చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఐసీసీ వన్డే ట్రోఫీ నెగ్గాలనే ఇంగ్లండ్ చిరకాల స్వప్నం మరోసారి భగ్నమైంది. అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ మరోసారి అంచనాలను తలకిందులు చేస్తూ తొలిసారి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీస్‌లో హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్‌పై 8 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది.
టోర్నీలో 300లకు పైగా లక్ష్యాలను నిర్దేశించి.. ఛేదించిన ఇంగ్లండ్ కీలక మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ హసన్ అలీ (3/35)తోపాటు జునైద్ ఖాన్ (2/42), అరంగేట్రం బౌలర్ రూమన్ రయీస్ (2/44) ధాటికి 49.5 ఓవర్లలో 211 రన్స్‌కే కుప్పకూలింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లలో రూట్ (46), బెయిర్‌స్టో (43), స్టోక్స్ (34) పోరాడడంతో.. అతికష్టం మీద 200 మార్కు దాటింది. ఈ మ్యాచ్ ఆరంభంలోనే ఓపెనర్ హేల్స్ (13) వికెట్ కోల్పోయినప్పటికీ బెయిర్‌స్టో, రూట్ ఆదుకున్నారు.
హసన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో అవుటైన తర్వాత రూట్, మోర్గాన్ మూడో వికెట్‌కు 48 రన్స్ జోడించారు. కీలక సమయంలో రూట్‌ను అవుట్ చేసిన షాదాబ్ పాక్‌కు బ్రేక్ ఇచ్చాడు. మరో 13 పరుగుల తేడాతో మోర్గాన్‌కు కూడా హసన్ పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో పట్టుబిగించిన పాక్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది.
ఆ తర్వాత లక్ష్య ఛేదనలో ఓపెనర్లు అజర్ అలీ, జమాన్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఉడ్ వేసిన మొదటి ఓవర్‌లో జమాన్ సిక్సర్‌తో ఖతా తెరిచాడు. ఇద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో 11వ ఓవర్‌లో పాక్ స్కోరు 50 పరుగులు దాటింది. రషీద్ వేసిన 17వ ఓవర్‌లో సింగిల్‌తో జమాన్ టోర్నీలో వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. ఉడ్ బౌలింగ్‌లో ఫోర్‌తో అర్థ సెంచరీ సాధించిన అజర్.. తర్వాత వేగంగా ఆడాడు. అయితే జమాన్‌ను రషీద్.. అవుట్ చేయడంతో 118 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత అజర్, బాబర్ ఆజమ్ (38 నాటౌట్) వేగంగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగెత్తింది.
అయితే అజర్‌ను బౌల్డ్ చేసిన జేక్ బాల్.. 55 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. కానీ, ఆజమ్‌కు జతకలిసిన హఫీజ్ (31 నాటౌట్) మరో వికెట్ పడకుండా పాక్‌ను విజయ తీరాలకు చేర్చాడు. పాక్ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్లు అజర్ అలీ (100 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 76), ఫఖర్ జమాన్ (58 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 57) అర్థశతకాలతో అదరగొట్టడంతో పాక్ 37.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో తొలిసారి అడుగుపెట్టింది.