ప్రపంచకప్ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల్లో వరల్డ్ కప్ క్రికెట్ పోరులో తన అవకాశాలను వెతుక్కోవాల్సిన టీమిండియాకు గట్టి షాక్ తగిలింది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయాల పాలయ్యాడు. ఐదో తేదీన దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడాల్సిన తరుణంలో, ప్రాక్టీస్‌కు వెళ్లిన వేళ, కోహ్లీకి గాయమైంది. దీంతో అతను ప్రాక్టీస్ నుంచి అర్ధాంతరంగా వెనుదిరిగి, హోటల్ గదికే పరిమితమయ్యాడు. కోహ్లీ చీలమండకు స్వల్ప గాయమైనట్టు సమాచారం.
ప్రస్తుతం అతని గాయాన్ని వైద్యులు పరిశీలిస్తున్నారని, దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో కోహ్లీ ఆడతాడా? లేదా? అనేది డౌటేనని జట్టు యాజమాన్యం తెలిపింది. ఈ వార్త క్రికెట్ ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేసింది.