బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా, భారత్ - ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య శుక్రవారం నుంచి చివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా, ఇప్పటివరకు నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ముగియగా, ఆస్ట్రేలియా జట్టు 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఈ నేపథ్యంలో సిడ్నీ వేదికగా చివరి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా రద్దు అయినా, మ్యాచ్ డ్రా అయినా టెస్ట్ సిరీస్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంటుంది. దీంతో చివరి టెస్ట్ మ్యాచ్‌ను భారత్ పకడ్బందీగా, అత్యుత్తమ జట్టుతో ఆడాల్సివుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ ఓ బ్యాడ్ న్యూస్ ప్రకటించారు.
సిడ్నీ వేదికగా జరిగే ఐదో టెస్ట్ మ్యాచ్‌కు పేసర్ ఆకాశ్ దీప్ అందుబాటులో ఉండడని, అతను వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని గంభీర్ ప్రకటించాడు. సిడ్నీ పిచ్‌ను పరిశీలించిన అనంతరం తుది జట్టును ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం జ రిగిన ప్రీ మ్యాచ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ పరిణామంతో మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. కాగా, ఆకాశ్ దీప్ రెండు టెస్టుల్లో కలిపి 87.5 ఓవర్లు బౌలింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఫీల్డర్లు మరికొన్ని క్యాచ్‌లను జారవిడిచారు. ఈ క్రమంలో ఆకాశ్ దీప్ స్థానంలో హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ్ కృష్ణలలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది.