భారత్‌లో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, సోమవారం శ్రీలంక, ఆప్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో క్రికెట్ పసికూన ఆప్ఘనిస్తాన్ జట్టు శ్రీలంకను చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు నిర్దేసించిన 242 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింద. దీంతో పాయింట్ల పట్టికలో ఆఫ్ఘాన్ జట్టు నాలుగో స్థానానికి ఎగబాకింది.
ఈ టోర్నీలో ఈ జట్టు ఇప్పటికే ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లను చిత్తుగా ఓడించింది. సోమవారం శ్రీలంకను చిత్తు చేసింది. పూణె వేదికగా జరిగిన మ్యాచ్‌లో 242 పరుగుల విజయలక్ష్యాన్ని ఆప్ఘాన్ కుర్రోళ్లు 45.2 ఓవర్లలో అలవోకగా చేధించారు. ఆ జట్టులో అజ్మతుల్లో ఒమర్ జాయ్ 73 (నాటౌట్), రహ్మత్ షా 62, కెప్టెన్ హష్మతుల్లా షాహిది 58 (నాటౌట్)లు అర్థ సెంచరీలతో రాణించగా, ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ 39 పరుగులతో రాణించాడు. దీంతో 242 పరుగుల విజయలక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక 2, కసున్ రజిత ఒక వికెట్ చొప్పున తీశాడు.
అంతకుముందు శ్రీలంక జట్టు 49.3 ఓవర్లలో అన్నివికెట్లను కోల్పోయి 241 పరుగులుచేసింది. ఆప్ఘాన్ బౌలర్లలో ఫరూక్ 4, రహ్మాన్ 2, ఒమర్జాయ్, రషీద్ ఖాన్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. లంక జట్టులో నిస్సాంక 46, మెండీస్ 39, సమరవిక్రమ 36, అసలంక 22, మ్యాథ్యూస్ 23, తీక్షణ 29, కరుణరత్నే 15, డి సిల్వ 14 చొప్పున పరుగులుచేశారు.
కాగా, ఈ విజయంతో ఆప్ఘనిస్తాన్ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. టోర్నీలో ఇప్పటివరకు మొత్తం 6 మ్యాచ్‌లు ఆడిన ఆప్ఘాన్... మూడు విజయాలు సాధించి ఆరు పాయింట్లను సాధించింది. మూడు మ్యాచ్‌లలో ఓడిపోయింది. అలాగే, ఆప్ఘాన్ జట్టు నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లతో తలపడాల్సివుంది.
మరోవైపు, పాయింట్ల పట్టికలో భారత్ 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత 10 పాయింట్లతో సౌతాఫ్రికా, 8 పాయింట్లతో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు మూడో స్థానంలోనూ ఉన్నాయి. ఆప్ఘాన్ తర్వాతి స్థానాల్లో శ్రీలంక, పాకిస్థాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లు వరుసగా ఉన్నాయి.