క్రికెట్ ప్రపంచంలో భారత క్రికెట్‌కు ఓ స్థానాన్ని కల్పించిన క్రీడాకారుల్లో హర్యానా హరికేన్ కపిల్ దేవ్ ఒకరు. 1983లో భారత క్రికెట్ జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడంలో కీలక పాత్ర పోషించిన కపిల్.. ఎన్నో దశాబ్ద కాలానికి పైగా భారత క్రికెట్‌ను శాసించాడు.
ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరుగాంచిన కపిల్.. ఇమ్రాన్ ఖాన్, హ్యాడ్లీ, ఇయాన్ బోథం సరసన పోల్చదగిన మహోన్నత వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. అలాంటి మహోన్నత వ్యక్తి గురించి ఈ వారం మన మహామహుల్లో తెలుసుకుందాం.
రామ్‌లాల్ నిఖంజ్ కపిల్ దేవ్ 1959 సంవత్సరం జనవరి ఆరో తేదీన చండీఘర్‌లో జన్మించాడు. కుడిచేతి వాటం ఫాస్ట్ మీడియంతో పాటు.. రైట్ హ్యాండ్ బ్యాటింగ్ స్టైల్ కలిగిన కపిల్ దేవ్.. భారత్, హర్యానా, నార్తాంపషైర్, వోరిస్టైర్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. తన కెరీర్‌లో మొత్తం 131 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కపిల్.. 29.4 సగటుతో 434 వికెట్లు పడగొట్టి, 5,248 పరుగులు చేశాడు.
అలాగే.. 225 వన్డే మ్యాచ్‌లు ఆడి 3,783 పరుగులు చేశారు. వన్డేల్లో అత్యధికంగా 175 (నాటౌట్) పరుగులు చేసి తన సత్తాను చాటాడు. 1978 అక్టోబరు నెలలో ఫైసలాబాద్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్ట్ అరంగేట్రం చేసిన కపిల్, 1994 మార్చి నెలలో హామిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో తన టెస్టు కెరీర్‌ను ముగించాడు.
అలాగే.. పాకిస్తాన్‌తో క్వెట్టాలో 1978 అక్టోబరు ఒకటో తేదీన జరిగిన వన్డే మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించిన కపిల్ తన కెరీర్‌లో చివరి వన్డేను 1994 అక్టోబరు 17వ తేదీన ఫరీదాబాద్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.