మాజీ సీనియర్ క్రికెటర్ అయిన దిలీప్ వెంగ్‌సర్కార్ ప్రస్తుత భారత క్రికెట పాలనా యంత్రాంగంలో ప్రముఖులు. ఈయన స్వస్థలం మహారాష్ట్రలోని రాజాపూర్. ఏప్రిల్ 6, 1956లో జన్మించారు. పూర్తి పేరు దిలీప్ బల్వంత్ వెంగ్‌సర్కార్. స్టైలిష్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన వెంగ్‌సర్కార్ బంతిని డ్రైవ్ చేయడంలో సిద్ధహస్తుడు.
ఆయన 1975-76లలో భారత జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్ రంగ ప్రవేశం చేశాడు. ఆ టెస్ట్‌లో భారత్ విజయం సాధించినా వెంగ్‌సర్కార్ విజయవంతం కాలేకపోయాడు. అయితే 1983 ప్రపంచ కప్ జట్టులో సభ్యుడిగా స్థానం సంపాదించాడు.
1985 నుంచి 1987ల మధ్య వెంగ్‌సర్కార్ తిరుగులేని సెంచరీలను చేసి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టేలా చేశాడు. పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్ట్ఇండీస్, శ్రీలంక దేశాలపై సెంచరీలను నమోదు చేశాడు. దీంతో ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా వెంగ్‌సర్కార్ మూడో స్థానాన్ని ఆక్రమించాడు.
క్రికెట్‌ను శాసిస్తున్న వెస్టిండీస్ బౌలింగ్‌కు ఎదురునిలిచి పోరాడి కెరీర్‌లోనే అత్యుత్తమ ఆటను ప్రదర్శించి తనకు తిరుగు లేదని నిరూపించాడు. మార్షల్, హోల్డింగ్, రాబర్ట్స్ వంటి మహామహుల హయాంలో వెస్టిండీస్‌పై ఆరు సెంచరీలు చేసిన ఘనత ఒక్క వెంగ్‌సర్కార్‌దే కావడం గమనార్హం.
1986లో ఇంగ్లాండ్‌పై టెస్ట్ సిరీస్ నెగ్గి భారత్‌కు కప్ అందించడమే కాక... మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా వెంగ్‌సర్కార్ అవార్డు కైవసం చేసుకున్నాడు. అలాగే బ్యాటింగ్ గణాంకాల్లో అత్యుత్తమ సగటుల్లో వెంగ్‌సర్కార్‌దే పైచేయి. 1987 కపిల్‌దేవ్ తర్వాత సారథ్య బాధ్యతలను స్వీకరించిన వెంగ్‌సర్కార్ కెప్టెన్ హోదాలో తొలి సిరీస్‌లోనే వరుసగా రెండు సెంచరీలను సాధించాడు.
కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు 1981లో భారత ప్రభుత్వం 'అర్జున' అవార్డుతో సత్కరించింది. అలాగే భారత క్రికెట్‌కు ఎనలేని సేవచేసినందుకు గాను ప్రభుత్వం 1987లో 'పద్మశ్రీ' పురస్కారంతో గౌరివించింది. అదే ఏడాదిలో 'విస్‌డన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు కూడా వెంగ్‌సర్కార్‌ను అలంకరించింది.
క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్ అనంతరం 1985లో వెంగ్‌సర్కార్ అకాడమీని ప్రారంభించి... అనంతరం 2003లో ముంబాయి క్రికెట్ అసోసియేషన్ సంఘానికి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2005లో భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ రేసులో అగ్రస్థానంలో నిలిచి... ప్రస్తుతం ఆ పదవినలంకరించి తానేంటో మరో సారి చూపించాడు వెంగ్‌సర్కార్.