Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అప్పట్లో సచిన్‌ను 'తెండిల్యా' అని ముద్దుగా పిలిచేవారట!!

Advertiesment
అప్పట్లో సచిన్‌ను 'తెండిల్యా' అని ముద్దుగా పిలిచేవారట!!
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న మాస్టర్ బ్లాస్టర్‌ దిగ్గజాల నీడలోనే తన కెరీర్‌ను ప్రారంభించారు. సచిన్ క్రికెట్‌ రంగ ప్రవేశం చేసే నాటికి భారత క్రికెట్ స్వరూపం చాలా వరకూ మారింది. సునీల్ గవాస్కర్, కపిల్‌దేవ్‌ల హవా క్రికెట్‌పై ఎంతో ఉంది. సిద్దు, సంజయ్‌మంజ్రేకర్, అజహరుద్దీన్, రవిశాస్త్రి లాంటి కీలక ప్లేయర్లు అప్పటికే జట్టులో ఉన్నారు. వారందరి నీడలోనే ఎదుగుతూ.. టీంలో తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని రిజర్వ్ చేసుకోగలిగాడు సచిన్ టెండూల్కర్.

మాస్టర్ తన తొలి టెస్టు సిరీస్‌లోనే తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు బాటలు వేసుకున్నాడు. సియాల్‌కోట్ టెస్ట్ మ్యాచ్‌లో వకార్ యూనిస్ వేసిన బంతి ముక్కుకు తగిలి రక్తం కారుతున్నా.. క్రీజ్ వదలకుండా 57 పరుగులు చేశాడు. ప్రత్యర్థిని ఎంత ధృడంగా ఎదుర్కోగలనో ఆనాడే చాటిచెప్పాడు. స్కూల్‌డేస్‌లో తన మిత్రుడు వినోద్ కాంబ్లీతో కలిసి.. 664 పరుగుల అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ రికార్డు తర్వాతే.. ముంబైలో క్రికెటర్లకు అతనేంటో తెలిసింది. అప్పటికి సచిన్ వయస్సు 15 ఏళ్లు. అప్పట్లో సచిన్‌ను అంతా తెండిల్యా అంటూ ముద్దుగా పిలిచేవారు.

జాతీయ స్థాయికి క్రికెట్ కోసం గ్రౌండ్‌లో అడుగుపెట్టిన సచిన్ తొలిమ్యాచ్‌లోనే సెంచరీ కొట్టాడు. అంతేకాదు.. దేశీయ క్రికెట్‌లో అత్యున్నత టోర్నీలైన రంజీట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల్లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీలు సాధించి రికార్డు సృష్టించాడు. నవంబర్ 15, 1989న ఇలా తొలిసారి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు టెండూల్కర్. అప్పటికి అతని వయస్సు 16 సంవత్సరాలు.

ఎన్నో రికార్డులతో ప్రత్యర్థి జట్లను ఆటాడుకున్న సచిన్, 1996 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసి రికార్డ్ సృష్టించాడు. తాజాగా 2011 ప్రపంచకప్‌లో తన చిరకాల స్వప్నాన్ని కూడా సచిన్ నెరవేర్చుకున్నాడు. తన కెరీర్‌లో వరల్డ్ కప్‌ను గెలుచుకున్న ఆటగాడిగానూ రికార్డు సాధించాడు.

ఇది మాత్రమే కాకుండా 2011 ప్రపంచ్ కప్‌లో రెండవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. కాగా, మాస్టర్ ఇలాంటి అరుదైన రికార్డులతో మరికొంత కాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాలని సచిన్ పుట్టినరోజు (శనివారం) సందర్భంగా మనం ఆశిద్దాం.!!

Share this Story:

Follow Webdunia telugu