మార్టిన్ క్రో.. న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజాల్లో ఒకరు. ఈయనకు క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఉంటుంది. అందులో అతని జీవితంలో జరిగిన అనేక అంశాలు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. ఆ క్రికెట్ దిగ్గజం స్ఫూర్తివంతమైన క్రికెటర్. క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న పొట్టి క్రికెట్ ట్వంటీ-20 సృష్టికర్త. అందుకే అతని సేవలు క్రీడాచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి అత్యుత్తమ న్యూజిలాండ్ క్రికెటర్ పాలిక్యులర్ లింఫోమా(బ్లడ్ క్యాన్సర్) అనే అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతూ తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు.
నిజానికి ఆ వ్యాధి నుంచి అతనికి విముక్తి లభించినట్లు 2012లో వైద్యులు వెల్లడించారు. అయితే మళ్లీ 2014లో లింఫోమా ఛాయలు బయటపడడంతో అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో మార్టిన్ కీమోథెరపీ చేయించుకుంటున్నాడు. అయితే, ఇప్పుడు ఆ వ్యాధి ముదరడంతో మార్టిన్ మృతి చెందినట్లు అతని కుటుంబసభ్యులు తెలిపారు. మార్టిన్‌కు భార్య లోరెన్ డైన్స్, కుమార్తె ఎమ్మా, సవతి పిల్లలు హిల్టన్, జాస్మిన్ ఉన్నారు.
1982-95 వరకు 13 సంవత్సరాల పాటు మార్టిన్ క్రో అంతర్జాతీయ కెరీర్ కొనసాగింది. 45.36 సగటుతో 77 టెస్టుల్లో కివీస్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మార్టిన్ పలు రికార్డులు నమోదు చేశాడు. రిటైరయ్యే సమయానికి కివీస్ తరపున అత్యధిక టెస్టు పరుగులు(5,444), అత్యధిక వ్యక్తిగత స్కోరు(299), అత్యధిక అర్థసెంచరీలు(35), అత్యధిక సెంచరీలు(17) సాధించాడు. ఇప్పటికీ అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన కివీస్ బ్యాట్స్‌మన్ రికార్డు మార్టిన్ పేరిటే ఉంది. 1991లో వెల్లింగ్టన్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 299 పరుగులు సాధించి రికార్డు నెలకొల్పాడు. 143 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించిన క్రో 38.55 సగటుతో 4,704 పరుగులు చేశాడు. ఆయన బౌలర్ చేతిలో బంతి రిలీజ్ అయ్యే స్పాట్‌ను బట్టి తన పొజిషన్ మార్చుకునేవాడు. అదే అయన విజయసూత్రంగా నిలిచింది.
అలాగే, మూడు వన్డే ప్రపంచకప్‌లలో కివీస్ జట్టు తరపున ఆడాడు. ఇందులో 1992 ప్రపంచకప్‌లో తన కెప్టెన్సీలో సొంతగడ్డపై జట్టును సెమీస్ చేర్చిన ధీరుడు. ఆయన రిటైర్ అయ్యాక స్కై టెలివిజన్ కోసం 'క్రికెట్ మ్యాక్స్' పేరుతో పొట్టి క్రికెట్ ఫార్మాట్‌ను ప్రవేశపెట్టారు. అదే కొన్ని మార్పులు చేర్పులతో నేటి టీ20గా మారి.. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆలరిస్తోంది. రాస్‌టేలర్, మార్టిన్ గప్తిల్ వంటి అగ్రశ్రేణి క్రికెటర్లకు ఆయన మార్గదర్శి. మార్టిన్ తమ దేశ అత్యుత్తమ క్రికెటర్ అని న్యూజిలాండ్ ప్రధాని జాన్ కే అన్నారంటే ఆయన స్థాయి అర్థం చేసుకోవచ్చు.
దిగ్గజ క్రికెటర్ మార్టిన్ క్రో మృతి కివీస్ క్రికెట్‌కు తీరని నష్టమని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పేర్కొంది. కివీస్ క్రికెటర్ మార్టిన్ క్రో మృతి చెందడం క్రికెట్ ప్రపంచానికి తీరని లోటని ఐసీసీ ప్రకటించింది. మార్టిన్ క్రో కెరీర్ అసాధారణం, అద్భుతం అని కొనియాడిన ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్‌సన్.. అతను నిజమైన క్రికెట్ దిగ్గజమని అన్నారు.