ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఫిల్ హ్యూగ్స్ (25) కోమాలోకి వెళ్లిపోయాడు. సిడ్నీ స్టేడియంలో ఒక స్థానిక క్రికెట్ జట్టుతో మ్యాచ్ ఆడుతూ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి బౌన్స్ అయి హెల్మెట్‌లోనుంచి దూసుకు వెళ్ళి అతని తలకి తగిలింది. దాంతో హ్యూగ్స్ గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. బంతి తగిలిన కారణంగా ఆయన తలకు తీవ్ర గాయమైంది.
ప్రస్తుతం ఆయనకు చికిత్స చేస్తున్నారు. హ్యూగ్స్ పరిస్థితి విషమంగా వుందని తెలుస్తోంది. బంతి తగిలిన కొద్ది క్షణాలకే కుప్పకూలిపోయి ఫిల్ హ్యూగ్స్ కోమాలోకి వెళ్ళిపోయారు. ఆయనను తక్షణం హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు అతనికి శస్త్రచికిత్స చేశారు.
ఈ ఘటన జరిగిన సమయంలో ఫిల్ హ్యూగ్స్ తల్లి, సోదరి క్రికెట్ గ్రౌండ్లోనే ఉన్నారు. ఫిల్ హ్యూగ్స్ ఇప్పటివరకూ 25 టెస్ట్ మ్యాచ్లు ఆడారు. టెస్ట్ క్రికెట్లో పదో వికెట్కు 163 పరుగుల భాగస్వామ్యం అందించి రికార్డు సృష్టించాడు.