భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య బెంగళూరులో జరుగుతున్న నాలుగో వన్డేలో టీం ఇండియా బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ విజృంభించాడు. నాలుగో వన్డేలో సాధించిన 45 పరుగులతో సెహ్వాగ్ తన ఖాతాలో 6వేల పరుగులను చేర్చుకున్నాడు. ఈ బెంగుళూరు వన్డేకు వరుణదేవుడు అంతరాయం కలిగించడంతో... సెహ్వాగ్ 45 పరుగుల వద్ద ఆటను ఆపుకున్నాడు.
తిరిగి 5.50 గంటలకు ప్రారంభం కానున్న ఈ వన్డే మ్యాచ్‌లో అర్థశతకానికి చేరువలో ఉన్న వీరేంద్ర సెహ్వాగ్, పరుగుల వర్షం కురిపిస్తాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
1978వ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీన జన్మించిన వీరూ 1999వ సంవత్సరం నుంచి వన్డే, 2001 నుంచి టెస్టులకు భారత జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కుడిచేతి వాటం చేయగల ఈ బ్యాట్స్‌మెన్, రైట్-ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కూడా చేయగలడు. భారత జట్టు తరపున టెస్ట్ క్రికెట్‌లో 5508 అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించాడు.
భారత్ తరఫున ఏకైక ట్రిపుల్ సెంచరీ వీరుడు కూడా ఇతనే. ఇప్పటికే 64 టెస్టు మ్యాచ్‌లను ఆడిన వీరూకు ప్రస్తుతం 30 సంవత్సరాల 34 రోజులు. తొమ్మిది టీ-20 మ్యాచ్‌ల్లో ఆడిన సెహ్వాగ్, 20-20 మ్యాచ్‌లలో 172 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో రాణించిన వీరూ... టెస్టుల్లో 29 వికెట్లు, వన్డేల్లో 84 వికెట్లు పడగొట్టాడు.