Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీలంక స్పిన్ మాంత్రికుడు మురళీధరన్

Advertiesment
శ్రీలంక స్పిన్ మాంత్రికుడు మురళీధరన్
, శుక్రవారం, 5 సెప్టెంబరు 2008 (17:02 IST)
WD PhotoWD
క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప బౌలర్లగా చెప్పుకోదగ్గవారిలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఒకరిగా చెప్పుకోవచ్చు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ గుండెల్లో గుబులు పుట్టించే మురళీధరన్ ఖాతాలో ఇప్పటికే వెయ్యి వికెట్లకు పైగా చేరాయి. శ్రీలంకలోని క్యాండీలో 1972 ఏప్రిల్ 17న జన్మించిన మురళీధరన్ 1992లో తన 20వ ఏట అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించాడు.

ఆస్ట్రేలియాతో కొలంబోలో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మురళీధరన్ ఆనాటి నుంచి నేటివరకు వికెట్ వేట కొనసాగిస్తునే ఉన్నాడు. తొలుత టెస్ట్ మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన మురళీధరన్ 1993లో భారత్‌తో జరిగిన సిరీస్‌లో వన్డేల్లోనూ ప్రవేశించాడు. స్పిన్ బౌలర్‌గా శ్రీలంక జట్టుకు ఓ నమ్మదగిన ఆటగాడిగా పేరుతెచ్చుకున్న మురళీధరన్ ఎన్నో మ్యాచ్‌లలో శ్రీలంకకు ఒంటి చేత్తో విజయాలను అందించాడు.

టెస్టు‌ల్లో ఇప్పటివరకు 756 వికెట్లు సాధించిన మురళీధరన్ ఈ వికెట్లను కేవలం 123 టెస్టుల్లోనే సాధించడం విశేషం. అలాగే ఇప్పటివరకు 314 వన్డేలాడిన మురళీధరన్ 479 వికెట్లు సాధించాడు. ఇలా టెస్టులు, వన్డేల్లో కలిపి 1000కి పైగా వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా మురళీధరన్ ప్రపంచ రికార్డు స్థాపించాడు.

ఇంత గొప్ప ఫీట్ సాధించిన మురళీధరన్ కెరీర్‌లో మైలురాళ్లకు హద్దే లేదు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు (710) సాధించిన తొలి బౌలర్‌గా 2007లో రికార్డు స్థాపించాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్ట్‌లు, వన్డేల్లో కలిపి అత్యధిక వికెట్లు (1165) సాధించిన తొలి బౌలర్‌గా 2007లోనే మరో రికార్డు స్థాపించాడు.


ఇక ఒకే టెస్ట్‌లో పది వికెట్లు చొప్పున 20 సార్లు అలాగే ఒకే టెస్టులో ఐదు అంతకన్నా ఎక్కువ వికెట్లను 61సార్లు పడగొట్టిన బౌలర్‌గా కూడా మురళీధరన్ రికార్డు సృష్టించాడు. ఇవే కాకుండా కేవలం మురళీకి మాత్రమే సాధ్యమైన కొన్ని రికార్డులు కూడా అతని సొంతమయ్యాయి.

వరసగా నాలుగు టెస్టుల్లో 10 వికెట్లు చొప్పున రెండు సార్లు సాధించిన ఏకైక బౌలర్‌గా మురళీధరన్ చరిత్ర సృష్టించాడు. అలాగే టెస్ట్ క్రికెట్ ఆడే అన్ని దేశాలపై 50కి పైగా వికెట్లు సాధించిన ఏకైక బౌలర్ మురళీధరనే కావడం గమనార్హం. టెస్ట్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు చొప్పున రెండు సార్లు సాధించిన రెండో బౌలర్ మురళీధరన్ కావడం విశేషం. అంతకుముందు ఈ ఘనతను జిమ్‌లేకర్ మాత్రమే సాధించారు.

ఓ బౌలర్‌గా ఇన్ని విజయాలు సాధించిన మురళీధరన్ కెరీర్‌లో వివాదాలకు సైతం కొదవలేదు. ఏ బౌలర్ కూడా ఎదుర్కోనన్ని వివాదాలను మురళీ ఎదుర్కొన్నాడంటే ఆశ్చర్యం వెయ్యకమానదు. అతని బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని, అతను చెకింగ్‌కు పాల్పడుతున్నాడంటూ కొన్ని దేశాలు మురళీపై విమర్శలు గుప్పించాయి.

ఆస్ట్రేలియా అయితే ఈ విషయంలో మురళీ పట్ల మరీ ఘోరంగా ప్రవర్తించింది. అక్కడి క్రీడాభిమానులు సైతం మురళీ బౌలింగ్‌పై విమర్శలు చేయడంతో పాటు అతను మైదానంలో ఉన్నప్పుడు అతనిపై అభ్యంతకరంగా ప్రవర్తించారు కూడా. అయితే కెరీర్‌లో ఎన్ని ఆటుపోటులు ఎదురైనా కూడా చెరగని చిరునవ్వుతో తన కర్తవ్యమే లక్ష్యంగా వికెట్ల వేట సాగిస్తున్న మురళీధరన్‌ను క్రికెట్ చరిత్రలో ఓ గుర్తించుకోదగ్గ అధ్యాయంగా చెప్పుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu