భారత్-శ్రీలంక జట్ల మధ్య బుధవారం దంబుల్లాలో జరిగిన తొలి వన్డేలో... వినూత్నమైన బ్యాటింగ్ విన్యాసంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న లంక ఆటగాడు సనత్ జయసూర్య వయసు మీరినప్పటికీ, తన ఆటతీరులోని వన్నె ఏ మాత్రం తగ్గలేదు. ముప్పై ప్లస్‌లో అడుగు పెట్టగానే చాలామంది క్రికెటర్లు రిటైరవుతున్న ప్రస్తుత తరుణంలో.. అద్భుతమైన ఫామ్‌తో జయసూర్య ఇంకా క్రికెట్‌లో కొనసాగుతున్నాడు.
అసలు బ్యాటింగ్ చేయటమే కష్టంగా ఉన్న పిచ్‌పై జయసూర్య ఆడిన ఇన్నింగ్స్ అమోఘం అని చెప్పుకోవచ్చు. ప్రారంభంలో వికెట్ పడకుండా చూడటమే లక్ష్యంగా చేసుకుని బ్యాటింగ్ చేసిన ఆయన ఇన్నింగ్స్ సాగే కొద్దీ వేగం పెంచాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో అద్భుతమైన ఫుట్‌వర్క్‌తో షాట్లు ఆడాడు.
ఏ మాత్రం విడ్త్ దొరికినా, బంతి షార్ట్‌పిచ్ అయినా బౌండరీకి పంపేందుకు జయసూర్య వెనుకాడలేదు. ఇక, షాట్ల ఎంపికలో వయసుపాటు వచ్చిన అనుభవం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇన్నింగ్స్ సాగే కొద్దీ అలసిపోయి పరుగు తీసేందుకు కష్టమైనా 107 పరుగులను సాధించి, జట్టుకు మంచి స్కోరును జతచేశాడు.
వయసు పైబడుతున్న కొద్దీ స్టార్ క్రికెటర్‌గా మరింత దూకుడుగా బ్యాట్ ఝళిపిస్తున్న సనత్ జయసూర్యలో... వయసు జోరుతో పాటు క్రికెట్ జోరు కూడా పెరుగుతూ వస్తోందని, ఆయన సాధించిన విజయాలను పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది. లంక-భారత్ తొలివన్డేలోనే జయసూర్య 13వేల పరుగుల మార్కును కూడా దాటేయటమేగాకుండా, అత్యంత పెద్ద వయస్సులో సెంచరీని పూర్తి చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు.