Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 'బర్త్‌ డే'కు రెడీ అయిన భాగ్యనగరం!

Advertiesment
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 'బర్త్‌ డే'కు రెడీ అయిన భాగ్యనగరం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ నాలుగో సీజన్‌తో రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌కి అదృష్టం కలిసివచ్చింది. శనివారం హైదరాబాద్ ఫ్రాంచైజీ డెక్కన్ ఛార్జర్స్-ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. ఉప్పల్ ఆతిథ్యమిస్తోన్న ఈ మ్యాచ్‌ జరిగే రోజే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు పుట్టినరోజు కావడం విశేషం.

అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో అరుదైన రికార్డులతో రాణిస్తున్న సచిన్ టెండూల్కర్ బర్త్ డేకు హైదరబాద్ ముస్తాబైంది. 39 ఏట అడుగుపెట్టే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు సందర్భంగా మహా ట్రీట్ ఇవ్వాలని ముంబై ఇండియన్స్ టీమ్‌తో పాటు యాజమాన్యం కూడా భారీ ఏర్పాట్లు చేస్తోంది. సచిన్ బర్త్ డే కావడంతో ఉప్పల్ స్టేడియం మ్యాచ్‌కు గిరాకీ పెరిగిపోయింది. ముంబై ఇండియన్స్-డెక్కన్ ఛార్జర్స్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుబోయాయి.

అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను రెండు దశాబ్దాల క్రితం ప్రారంభించిన మాస్టర్ సచిన్, ప్రపంచంలో అతిగొప్ప క్రికెటర్‌గా ఖ్యాతిగడించాడు. దేశంతా సచిన్ జపం చేస్తున్న నేపథ్యంలో ముంబై-డెక్కన్ ఛార్జర్స్ మ్యాచ్‌ను వీక్షించేందుకు క్రీడాభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

రికార్డుల మీద రికార్డులు నెలకొల్పి అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఓ వెలుగు వెలుగుతున్న సచిన్ టెండూల్కర్ ఇప్పటివరకు వన్డేల్లో-46 సెంచరీలు, 17598 పరుగులు సాధించాడు. అలాగే టెస్టుల్లో 47 సెంచరీలు, 13447 పరుగులు చేశాడు.

ఇరవై ఒక్క సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నా.. అలుపన్నది ఏనాడూ ఎరగడు సచిన్.. ఇటీవల నటించే అవకాశం వచ్చినా వద్దనారట. క్రికెట్ ఆడటమే తన లక్ష్యమని, నటనపై ఆసక్తి చూపేది లేదని మాస్టర్ ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారట. సచిన్ ఎంట్రీ తర్వాతే సిక్స్‌లు.. ఫోర్లు.. సెంచరీలతో ఇండియాను క్రికెట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

ఇండియన్ క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించిందీ మన సచినే. ఇంకా లిక్కర్ వాణిజ్య ప్రకటనకు అంబాసిడర్‌గా కొనసాగనని పేర్కొన్న సచిన్ తన తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో అద్భుత రికార్డులతో అదరగొడుతున్న సచిన్‌ గర్వం లేకుండా ప్రవర్తిస్తాడు.

కానీ ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించిన టెండుల్కర్‌కు రెండు విషయాలు మాత్రం కలవరపెడుతూనే ఉంటాయి. ఇందులో ఒకటి.. తన హయాంలో ప్రపంచకప్‌ను గెలవకపోవడం అయితే.. రెండోది టీమిండియా కెప్టెన్‌గా రాణించలేకపోవడం. అయితే ముంబై ఇండియన్స్‌ను ఐపీఎల్-3లో ఫైనల్స్‌కు చేర్చడం ద్వారా మంచి కెప్టెన్ అనిపించుకున్నాడు సచిన్.

ఇకపోతే.. ఇండియన్ క్రికెట్‌లో ఎవరు గొప్ప.. గవాస్కరా.. టెండుల్కరా... అనేదానికి సమాధానం గవాస్కరే చెప్పాడు. వన్డేల్లో ఎవరికీ సాధ్యం కాని డబుల్‌టన్‌ను సచిన్ సాధించాక.. గవాస్కర్ శిరస్సు వంచి సలామ్ కొట్టాడు. క్రికెట్ అభిమానుల దృష్టిలో సచిన్ ఓ దేవుడు. ఇంకేముంది.. 38 వసంతాలు పూర్తి చేసుకుంటున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. మరిన్ని అరుదైన రికార్డులను సృష్టించాలని కోరుకుంటూ బర్త్‌డే విషెస్ చెప్పేద్దాం. హ్యాపీ బర్త్‌డే సచిన్..!!

Share this Story:

Follow Webdunia telugu