Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత క్రికెట్‌లో జార్ఖండ్ డైనమేట్... ధోనీ

Advertiesment
భారత క్రికెట్‌లో జార్ఖండ్ డైనమేట్... ధోనీ
, సోమవారం, 15 సెప్టెంబరు 2008 (16:37 IST)
WD PhotoWD
భారత జట్టులో ప్రవేశించిన అచిరకాలంలోనే అటు ఆటగాడిగాను, విజయవంతమైన కెప్టెన్‌గాను చరిత్ర సృష్టించగల్గడం మహేంధ్రసింగ్ ధోనీకి మాత్రమే సాధ్యమైంది. వికెట్ కీపర్‌గా భారత జట్టులోకి ప్రవేశించిన ధోనీ ఓ స్థిరమైన బ్యాట్స్‌మెన్‌గా నిలదొక్కుకోగలిగాడు. ఎంత గొప్ప బౌలర్‌నైనా లెక్కచేయకుండా తనకు మాత్రమే చేతనైన బ్యాటింగ్ శైలితో పరుగుల వరద పారించడం ధోనీకే చెల్లింది.

మామూలు ఆటగాడిగా జట్టులోకి ప్రవేశించిన దాదాపు మూడేళ్లకే ధోనీ కెప్టెన్సీ చేపట్టగలిగాడంటే అతని ప్రతిభ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. వివాదరహితుడిగా అందరినీ కలుపుకుపోగల ఓ మంచి నాయకుడిగా అందరికీ మార్గదర్శకం కాగల ఓ ఆటగాడిగా ధోనీ భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు.

ఇన్నిరకాలుగా ప్రతిభ కల్గిన ధోనీ గురించి తెల్సుకుంటే... 1981 జులై ఏడున బీహార్‌లోని రాంచీ నగరంలో ధోనీ జన్మించాడు. చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే‌తో 2004 డిసెంబర్లో ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అప్పటినుంచి ఇప్పటివరకు 120 వన్డేల్లో 107 ఇన్నింగ్స్‌లు ఆడిన ధోనీ 3793 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలతో పాటు 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

అలాగే శ్రీలంకతో స్వదేశంలో జరిగిన మ్యాచ్‌తో టెస్ట్ అరంగేట్రం చేసిన ధోనీ ఇప్పటివరకు 29 టెస్టుల్లో 47 ఇన్నింగ్స్‌లు ఆడి 1418 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు తొమ్మిది అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇలా వన్డేలు, టెస్టుల్లో ప్రతిభ చూపడం ద్వారా ఆకట్టుకున్న ధోనీ కొద్దికాలంలో భారత వన్డే జట్టుకు సారధిగా బాధ్యతలు చేపట్టాడు.

సారధిగా ఎక్కువ విజయాలు నమోదు చేసిన ధోనీ తన సారధ్యంలో భారత్‌కు ట్వంటీ20 ప్రపంచకప్‌ను అందించడం విశేషం. అలా తన విజయపరంపరను కొనసాగించిన ధోనీ తాజాగా శ్రీలంకలో జరిగిన సిరీస్‌లోనూ వన్డే సిరీస్‌ను సాధించడం గమనార్హం. పై అంశాల్లోనే కాకుండా బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఐపీఎల్ టోర్నీలోనూ తన సత్తా చాటాడు.

ఈ టోర్నీలో భాగంగా చెన్నై జట్టు కెప్టెన్‌గా ధోనీ వేలంలో ఎక్కువ ధర పలకడం విశేషం. ఈ విధంగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించిన కొద్దికాలంలోనే అత్యంత ఉన్నత స్థితికి చేరిన ధోనీ కెరీర్ ఇదే ఊపుతో మునుముందు కూడా సాగాలని ఆకాంక్షిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu