Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ ఎంత ఎదిగింది...! : జాంటీ రోడ్స్

Advertiesment
భారత్ ఎంత ఎదిగింది...! : జాంటీ రోడ్స్
, శుక్రవారం, 24 అక్టోబరు 2008 (04:49 IST)
ఆస్ట్రేలియాపై మొహాలీ టెస్టులో భారత్ ప్రదర్శించిన ఆటతీరు అద్వితీయమని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, ప్రపంచ అత్యుత్తమ ఫీల్డర్ జాంటీ రోడ్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్ జట్టులోని ఆ 'నలుగురు' బ్యాట్స్‌మెన్ వయసు పెరిగేకొద్దీ తమ ఆటను మరింత మెరుగుపర్చుకుంటూ వస్తున్నారని కొనియాడాడు.

అయితే రెండో టెస్టులో ప్రత్యర్థిపై భారత్ 320 పరుగుల భారీ ఆధిక్యతతో గెలిచి వీరవిహారం చేసినప్పటికీ ఆసీస్‌ను తక్కువగా అంచనా వేయవద్దని జాంటీ హెచ్చరించాడు. ఢిల్లీ, నాగపూర్‌లలో చివరి రెండు టెస్టులను ఆసీస్ తేలిగ్గా తీసుకోదని చెప్పాడు.
మామూలుగానే భారత జట్టును స్వదేశంలో ఓడించటం కష్టమని అలాంటిది ఆ జుట్టుకు ప్రస్తుతం ఇద్దరు నిజమైన ఫాస్ట్ బౌలర్లు కూడా తోడయ్యారని పేర్కొన్నాడు.

జహీర్‌ఖాన్, ఇషాంత్ శర్మలు కొత్త బంతితో స్వింగ్, పాతబంతితో రివర్స్ స్వింగ్ చేస్తూ పాకిస్తాన్ ద్వయం వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్‌లను తలపిస్తున్నారని జాంటీ అన్నాడు. భారత్ ఇప్పుడు ప్రత్యర్థి జట్టుకు చెందిన 20 వికెట్లను కూల్చేందుకు పూర్తిగా స్పిన్నర్లపైనే ఆధారపడే స్థితిలో లేదని రోడ్స్ చెప్పాడు.

దక్షిణాఫ్రికా వైన్స్‌ను ప్రమోట్ చేసేందుకు ప్రస్తుతం మొంబై వచ్చి ఉన్న జాంటీ భారత సీనియర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ వయసు ముదిరేకొద్దీ మరింతగా రాటు దేలుతున్నారని ప్రశంసించాడు.

భారత్ జట్టు ప్రస్తుతం అన్ని విధాలా సమతూకంతో ఉందని నలుగురు దిగ్గజ బ్యాట్స్‌మెన్ వయసుతో పోటీపడుతున్నారని జాంటీ చెప్పారు. అందుకే రెండో టెస్టులో ఏం జరగనుందే తొలి టెస్టు ముందే సూచించిందని తెలిపాడు. గత పది సంవత్సరాలుగా ఆసీస్ జట్టు తాను ఆధిక్యతలో ఉన్నప్పుడు ఎవరికీ ఏ అవకాశం ఇవ్వలేదని రోడ్స్ చెప్పాడు.

బెంగుళూరులో జరిగిన తొలి టెస్టులో గెలిచే అవకాశం దరిదాపుల్లో ఉన్నప్పటికీ ఆసీస్ విజయం వైపు పయనించలేక పోయిందని, ఇక మొహాలీలో వారికి అన్ని దారులూ మూసుకుపోయాయని జాంటీ రోడ్స్ చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu