ముంబైలోని మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన యువకుడు. వయస్సు... 16 ఏళ్లు. హేమాహెమీలు ఉన్న భారత క్రికెట్ జట్టులో కొత్త కుర్రాడు. నూనూగు మీసాల బుడతడు. ఈ బుడతడేనా... పాకిస్థాన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేది.... అని నోరెళ్ళబెట్టిన వారే అధికం. చివరకు ఆ బుడతడే ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రం వంటి ప్రపండ బౌలర్లను చీల్చి చెండాడే చిరుత అవుతాడని ఎవరూ ఊహించలేదు.
తొలి మ్యాచ్‌లో 24 బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేసినప్పటికీ.. ఆ తర్వాతి కాలంలో బౌలర్లకు ఎన్నో నిద్రలేని రాత్రులు చేసి, వారిపాలిట సింహస్వప్నంగా మారాడు. అతనే మన 'మాస్టర్ బ్లాస్టర్'. సచిన్ గురువారం (24వ తేది)తో 34 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35వ యేటలోకి అడుగుపెట్టబోతున్న తరుణంలో మన మేటి క్రికెటర్ గురించి తెలుసుకుందాం.
నన్ను తలపిస్తున్నాడు: బ్రాడ్‌మెన్
ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత బ్యాట్స్‌మెన్ సర్ డోనాల్డ్ బ్రాడ్‌మెన్.. ఒకరోజు మాట్లాడుతూ 'సచిన్ నన్ను తలపిస్తున్నాడు' అని అన్నారు. ఈ వ్యాఖ్యలు చాలు సచిన్ గురించి తెలుసుకునేందుకు. ఒక మహా క్రికెటర్ నుంచి ప్రశంసలు అందుకున్న సచిన్ భారత క్రికెట్‌కు వెన్నెముకగా నిలిచాడు. అభిమానులు మాత్రం ముద్దుగా 'లిటిల్ మాస్టర్' అని పిలుచుకుంటారు. భారత క్రికెట్ చరిత్రలో ఉన్న మహామహుల కంటే సచిన్ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు.
ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మాస్టర్ బ్లాస్టర్.. తన తెలివితేటలు, స్వశక్తి సామర్థ్యాలతో పైకొచ్చాడు. ముఖ్యంగా తనపై వచ్చే విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెపుతూ.. తన నైపుణ్యానికి మరింత పదునుపెడుతూ ఎదిగాడు. ఇదొక్కటే కాదు.. తనకు ధైర్య సాహసాలు మెండు అని సచిన్ తన 16వ ఏటనే నిరూపించాడు. పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు క్రికెట్ మ్యాచ్‌తో ఈ బుడతడు ప్రపంచ క్రికెట్ యవనికపై ప్రత్యేక ముద్రను వేసుకున్నాడు.
కేవలం బ్యాటింగ్‌లో మాత్రమే కాకుండా మ్యాచ్‌లోని ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించే నేర్పు, ఓర్పు అతని సొంతం. అంతేకాకుండా ప్రపంచంలో వివిధ దేశాలకు చెందిన వివిధ రకాల బౌలర్లను తన తెలివితేటలు, బ్యాటింగ్ అస్త్రాలతో సమర్థవంతంగా ఎదుర్కొనే తీరు అమోఘం. పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను మలుచుకుంటూ మూడు దశాబ్దాలకుపైగా క్రీడాజీవితాన్ని కొనసాగిస్తున్న ఏకైక క్రికెటర్. కేవలం ఒక బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా.. అవసరమైనపుడు జట్టుకు పనికొచ్చే స్లో బౌలర్‌గా కూడా అమూల్యమైన సేవలు అదిస్తున్నాడు.
ఇలాంటి ప్రత్యేకతలు ఎన్నింటినో సొంతం చేసుకోవడం వల్లే సర్ డోనాల్డ్ బ్రాడ్‌మెన్ తర్వాత రెండో గొప్ప టెస్టు క్రికెటర్‌గా, వన్డేల్లో సర్ వివిన్ రిచర్డ్స్ తర్వాత రెండో బ్యాట్స్‌మెన్‌గా ఖ్యాతి గడించాడు. ఈ పేరుతో పాటు.. భారత క్రీడారంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారమైన 'రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న' అవార్డును 1997-98 సంవత్సరానికి గాను సచిన్ సొంతం చేసుకున్నాడు. అలాగే 1999లో భారత ప్రభుత్వం ఇచ్చే 'పద్మశ్రీ' అవార్డును అందుకున్నాడు. వీటితో పాటు.. 'అర్జున', 'పద్మభూషణ్' పురస్కారాలను సైతం కేంద్రం నుంచి అందుకున్నాడు.
ముఖ్యంగా.. ఒక్క రోజు అంతర్జాతీయ మ్యాచ్‌లలో పరుగుల యంత్రంగా సచిన్‌కు పేరుంది. వన్డేల్లో 16వేల పైచిలుకు పరుగులు చేయగా, టెస్టుల్లో బ్రియాన్ లారా రికార్డును బద్దలు కొట్టేందుకు అతి సమీపంలో ఉన్నాడు. వన్డేల్లో 42, టెస్టుల్లో 39 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా సచిన్ చెరగని ముద్ర వేసుకున్నాడు.
గత 2007లో జరిగిన ప్రపంచ కప్‌లో మినహా.. మిగిలిన వరల్డ్ కప్‌లలో అత్యుత్తమ ప్రతిభను సచిన్ కనపరిచాడు. ముఖ్యంగా.. 2003, 1996 ప్రపంచ కప్‌లలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా లిటిల్ మాస్టర్ రికార్డు సృష్టించాడు. అలాగే ఒక క్యాలెండర్ ఇయర్‌లో వన్డేల్లో వెయ్యి పరుగుల ఫీట్‌ను ఆరుసార్లు సాధించిన ఘనత సచిన్ సొంతం.
1994, 1996, 1997, 1998, 2000, 2003 సంవత్సరాల్లో ఈ ఘనతను సాధించాడు. టెస్టులు, వన్డేల్లో కలిపి అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు మన మాస్టర్ బ్లాస్టర్ పేరిటే ఉంది. ఇలా క్రికెట్ ప్రపంచానికి మార్గదర్శిగా ఉన్న మాస్టర్ బ్లాస్టర్ గురువారం తన 35వ జన్మదిన వేడుకలను జరుపుకోనున్నారు.