Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్లెన్ మెక్‌గ్రాత్

Advertiesment
గ్లెన్ మెక్‌గ్రాత్
ఆస్ట్రేలియా బౌలింగ్ లెజెండ్లలో ఒకడిగా పేరు గాంచిన గ్లెన్ మెక్‌గ్రాత్ (40) 2007 ప్రపంచకప్ తరువాత అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పాడు. క్రమశిక్షణకు మారుపేరైన మెక్‌గ్రాత్ జట్టులో ఉన్నంత వరకు ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంత ప్రభావవంతంగా ఉండేదో క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇతని ముద్దుపేరు "పిజియన్".

కెరీర్‌లో ఆస్ట్రేలియా, ఢిల్లీ డేర్‌డెవిల్స్, ఐసీసీ వరల్డ్ ఎలెవన్, మిడిల్‌సెక్స్, న్యూసౌత్ వేల్స్, వర్సస్టెర్‌షైర్ జట్ల తరపున ఆడిన గ్లెన్ మెక్‌గ్రాత్‌ను కొందరు క్రీడాపండితులు బక్కపలచని ఆంబ్రూస్‌గా వర్ణించేవారు. 1993లో మార్వ్ హుగెల్ స్థానంలో ఆస్ట్రేలియా టెస్ట్ జట్టులో అడుగుపెట్టిన మెక్‌గ్రాత్ ఈ తరువాత జట్టులో తిరుగులేని బౌలర్‌గా ఎదిగాడు.

మెక్‌గ్రాత్ ఆడిన కాలంలో అతడిని మించిన మరో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఆ జట్టులో లేడంటే అతిశయోక్తి కాదు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఫాస్ట్‌బౌలర్‌గా కోట్నీ వాల్స్ పేరిట ఉన్న రికార్డును మెక్‌గ్రాత్ 2005లో బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్‌కు అందించిన ఫాస్ట్ బౌలర్‌లలో మెక్‌గ్రాత్ పేరిటనే మిగిలినవారి కంటే ఘనమైన రికార్డులు ఉన్నాయి.

2006-07 యాషెస్ సిరీస్ సందర్భంగా మెక్‌గ్రాత్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇదిలా ఉంటే 2007లో ఆస్ట్రేలియా ప్రపంచకప్ విజయంలో మెక్‌గ్రాత్ కీలకపాత్ర పోషించాడు. ఆ ప్రపంచకప్‌లో మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకున్న మెక్‌గ్రాత్ అనంతరం వన్డే క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. 2007 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ మెక్‌గ్రాత్ చివరి వన్డే కావడం గమనార్హం.

ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున మెక్‌గ్రాత్ ఆడుతున్నాడు. తొలి సీజన్ ఆద్యంతం ఆడిన మెక్‌గ్రాత్‌కు ఇటీవల జరిగిన రెండో సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. మరో ఏడాదిపాటు మెక్‌గ్రాత్‌కు ఢిల్లీ జట్టుతో ఒప్పందం ఉంది.

అందరు ఫాస్ట్ బౌలర్ల మాదిరిగానే కెరీర్‌లో అప్పుడప్పుడు గాయాల సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, వెంటనే జట్టులోకి వచ్చేవాడు. ఎంతో క్రమశిక్షణతో బౌలింగ్ చేసే మెక్‌గ్రాత్ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంపై కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడు. అందువలనే 14 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో అతను జట్టుకు ఎక్కువ కాలం దూరంగా ఉన్న సందర్భాలు చాలా తక్కువ. కెరీర్ చివరి అంకంలో భార్య అనారోగ్యం మెక్‌గ్రాత్‌ను బాగా ప్రభావితం చేసింది. ఈ కారణంగానే అతను క్రికెట్‌కు దూరం కావాలని నిర్ణయించుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu