ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్యతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. నిజానికి కోవిడ్-19 వైరస్ మెజార్టీ కేసుల్లో మరీ అంత ప్రాణాంతకమైనది ఏం కాదు. అయితే ఆ వైర స్ వివిధ దశల్లో చూపే ప్రభావాన్ని ప్రజలు అంచనా వేయలేకపోతున్నారని.. అందువల్లే ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు
లాక్‌డౌన్ సడలింపుల తర్వాత వైరస్ పెద్దఎత్తున వ్యాప్తి చెందుతున్నప్పటికీ ప్రజలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండటంలేదని పేర్కొంటున్నారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజేషన్ వంటి అంశాల్లో కొంత అవగాహన వచ్చినప్పటికీ లక్షణాలను గుర్తించడం, వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, సకాలంలో ఆస్పత్రులకు వెళ్లడం వంటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారు.
అదే సమయంలో కోవిడ్ లక్షణాలు ఉంటే ఫలానా మందులు వాడండి, ఫలానా కషాయం తాగండి అని సోషల్ మీడియాలో వస్తున్న వాటిని పాటించి కూడా సమస్యను కొనితెచ్చుకుంటున్నారు. సొంత వైద్యం ప్రాణాలకే ముప్పని వైద్యులు సూచిస్తున్నారు
సొంత వైద్యం కూడా కారణం
దగ్గు, జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు తదితర కరోనా లక్షణాలు కనిపించినప్పటికీ చాలామంది సీరియస్‌గా తీసుకోవడం లేదు. తెలిసిన వైద్యుల సూచనలు గానీ మెడికల్ షాపుల్లో ఇచ్చే మందులు వాడుతున్నారు. విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటూ తాము సురక్షితమే అన్న భావనలో ఉంటున్నారు.
మరికొందరు ఇంటర్నెట్ సమాచారం అధారంగా సొంత వైద్యం చేసుకుంటున్నారు. దీనివల్ల జ్వరం, తలనొప్పి, దగ్గు పాక్షికంగా తగ్గినా ప్రయోజనం ఉండటం లేదు. వైరస్ లక్షణాలను ఈ మందులు కప్పి వేయడంతో కరోనా రాలేదనే భావనతో ఎక్కువ మంది ఉంటున్నారు.
అతిగా కషాయం తాగడమూ ఇబ్బందే
కరోనాను ఎదుర్కోవడంలో కషాయం కూడా ముఖ్యమైనదన్న ప్రచారం మరీ ఎక్కువగా జరుగుతుండడంతో ప్రజలు అంతా ఇప్పుడు మిరియాలు, శొంఠి నుంచి మొదలుపెట్టి ఏడెనిమిది రకాల దినుసులతో కషాయం చేసుకుంటున్నారు. పరగడుపునే మొదలుపెట్టి రోజుకు అనేకసార్లు పరిమితికి మించి తాగేస్తున్నారు. సి-విటమిన్ కోసమంటూ నిమ్మకాయల రసాన్నీ కలుపుతున్నారు.
ఫలితంగా గ్యాస్ట్రిక్ సమస్యలు అధికంగా వస్తున్నాయి. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతోంది. గుండె పట్టేసినట్లుగా ఉండడం వల్ల గుండెపోటు వచ్చిందన్న ఆందోళనతో కూడా ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అధిక వేడితో కషాయం తాగడం వల్ల కొందరికి గొంతులో పుండ్లు పడుతున్నాయి.
నిమ్మకాయ రసం అధికంగా తాగడం వల్ల దంతాలపై ఎనామిల్ దెబ్బతింటోంది. కషాయం తాగడం కంటే వేడి నీటితో ఆవిరి పట్టుకోవడం మరింత శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు.
కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలకు దూరం
కోవిడ్-19 పరీక్షలను విస్త్రృతంగా చేస్తున్నప్పటికీ ప్రజలు ఇప్పటికీ స్వచ్చంధంగా ముందుకు రావడం లేదు. ఎక్కడ పాజిటివ్ అని తేలుతుందేమో అనే భయంతో కొందరు, పరీక్షలకు వెళ్తే ఇతరుల ద్వారా వ్యాపిస్తుందన్న అపోహతో మరికొందరు ఆగిపోతున్నారు. పాజిటివ్ వస్తే కుటుంబసభ్యులు భయపడుతారని మరికొందరు వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటివారు సొంత వైద్యంతో తగ్గించుకుందామనే ధీమాతో ఉంటున్నారు.
కోవిడ్-19 లక్షణాలున్నవారు పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ఇది కూడా కోవిడ్-19 వైరస్ వ్యాప్తికి ఒక కారణంగా చెప్పవచ్చు.
ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం
కోవిడ్-19 పాజిటివ్ కేసుల్లో సొంత వైద్యంచేసుకున్నవారు లేదా పరీక్షల జోలికి వెళ్లనివారే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. సొంత వైద్యం కారణంగా చికిత్సను ఆలస్యం చేయడంతో విలువైన సమయం వృథా అయి.. వైరస్ తీవ్రత పెరిగి పరిస్థతులు విషమిస్తున్నాయి.
ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారి, ఆక్సిజన్ స్థాయి ఒక్కసారిగా పడిపోతుండటంతో అప్పుడు ఆస్పత్రులకు వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. అప్పటికే వ్యాధి ముదిరిపోవడంతో వైద్యుల కూడా ఏమి చేయలేని పరిస్థితి ఎదురవుతోంది. ఆస్పత్రికి వచ్చిన వెంటనే వారికి ఆక్సిజన్ లేదా ఐసీయూలో ఉంచి చికిత్స అందించాల్సిన పరిస్థితి వస్తున్నది.
వైద్యుల సలహా తప్పక తీసుకోండి
కోవిడ్-19 లక్షణాలు ఉన్నవారు సొంతగా వైద్యంచేసుకోవడం వల్ల కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న నొప్పి నివారణ, జ్వరం, ఇతర మందులను యథేచ్ఛగా వాడుతున్నారు.
అంతేకాకుండా జ్వరం, ఆయాసం ఉన్నవారు ఆక్సిజన్ లెవల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. రెండు, మూడురోజులు వరుసగా జ్వరం, గొంతు నొప్పి ఉంటే ఆక్సిజన్ లెవల్స్ తరచూ చెక్‌చేసుకోవాలి. ఆక్సిజన్ లెవల్ 95% కంటే తగ్గువగా ఉన్నట్టయితే ఆస్పత్రులకు వెళ్లడం మంచిది.
వైరస్ తీవ్రత ఆధారంగా వైద్యులు మందులను సూచిస్తారు. వైద్యుల సలహా తీసుకోకుండా వాడటం కొత్త సమస్యలను కొని తెచ్చుకోవడమే అవుతుందంటున్నారు.
ఇలాంటి వాటి వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అజిత్రోమైసిన్, డైక్లోఫెనాక్ వంటి మందుల వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్టు అధ్యయనాలు చెప్తున్నాయి. ఆస్పత్రిలో వైద్యులు చికిత్స చేసి ఇచ్చే మందుల్లో మనం ఇంట్లో వాడేవి ఉన్నప్పటికీ అవి పేషెంట్ కండీషన్ ను బట్టి వాడాల్సిన అవసరం ఉంటుంది.
అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ టెలీమెడిసిన్ 14410 నంబర్ కు కాల్ చేసి ఉచితంగా వైద్య సలహాలు పొందవచ్చు. కోవిడ్ కు సంబంధించిన చికిత్స, పరీక్షలు ఎక్కడ చేస్తారు? కోవిడ్ ఆస్పత్రుల వివరాలాంటి సమాచారం కోసం 104, 1902 కాల్ సెంటర్లు లేదా 8297104104 హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.
ఏది ఏమైనా ప్రభుత్వ వారు ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి సూచనలను తప్పక పాటిస్తూ మన జాగ్రత్తలో మనం ఉంటూ మన కుటుంబాన్ని మన చుట్టుపక్కల వారిని మనల్ని మనము కరోనా బారిన పడకుండా కాపాడుకోవాల్సిన తరుణమిది.