ప్రపంచం కరోనా థర్డ్ వేవ్ దిశగా పయనిస్తుందని, ఇది కాదనలేని వాస్తవం అని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా వాస్తవిక పరిస్థితులపై వీకే పాల్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే మూడు, నాలుగు నెలలు ఎంతో కీలకమన్నారు. ప్రపంచం కరోనా థర్డ్ వేవ్ దిశగా వెళుతోందని, ఇది కాదనలేని వాస్తవమన్నారు.
ఇప్పటికే అమెరికా మినహా మిగతా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని వీకే పాల్ వివరించారు. భారత్‌లో ఇప్పటివరకు హెర్డ్ ఇమ్యూనిటీ రాలేదని, కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉందని గుర్తుచేశారు.
దేశంలో కొవిడ్ థర్డ్ వేవ్ రాకుండా చూడాలన్న లక్ష్యం దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. టీకా రెండు డోసులు తీసుకున్న వారిలో 95 శాతం మరణాలు తగ్గాయని వీకే పాల్ అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కరోనా టీకాలను విధిగా వేయించుకోవాలని ఆయన కోరారు.