తెలంగాణ రాష్ట్రంలో ఒక కరోనా వైరస్ వెలుగు చూసింది. బెంగుళూరులోని ఓ ఐటీ కంపెనీలో పని చేసే టెక్కీ దుబాయ్ వెళ్లి స్వదేశానికి వచ్చాడు. ఆ తర్వాత బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు రాగా, అతనికి కరోనా వైరస్ సోకిందని నిర్ధారించారు. ప్రస్తుతం ఆ టెక్కీని గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు చేపట్టేలా అదేశించింది. ఇదే అంశంపై ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖతో పాటు.. మంత్రులు మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సమావేశానంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, కరోనా వస్తే తప్పక చనిపోతారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అలాంటి ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కోవిడ్-19పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని వ్యాపార ప్రయోజనాలకు వాడుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కరోనాను అరికట్టేందుకు గాంధీ ఆసుపత్రిలో అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. వైరస్‌పై పత్రికలు, టీవీలు ప్రచారం చేయాలని సూచించారు. ప్రజలకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
కరోనాకు చికిత్స అందించేందుకు ప్రత్యేక ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. అన్ని శాఖల పరంగా ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రజలు అందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.