Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్ గురించి భయం వద్దు: సీఎం కేసీఆర్

కరోనా వైరస్ గురించి భయం వద్దు: సీఎం కేసీఆర్
, బుధవారం, 27 మే 2020 (23:24 IST)
కరోనా విషయంలో ప్రజలు భయోత్పాతానికి గురి కావాల్సిన పనిలేదని, లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఏమీ లేదని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.
 
ఒక వేళ రాబోయే రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినప్పటికీ, తగిన వైద్య సేవలు అందించడానికి వైద్య,ఆరోగ్య శాఖ సంసిద్ధంగా ఉందని ప్రకటించారు. వైరస్ సోకిన వారిలో ఎవరికైనా ఆరోగ్యం బాగా క్షీణిస్తే అత్యవసర వైద్యం అందించాలని వైద్యాధికారులను కోరారు. 
 
వైద్యశాఖ అధికారులు, వైద్య నిపుణులు, కోవిడ్ -19 విషయంలో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న రాష్ట్ర స్థాయి కమిటీ ముఖ్యమంత్రి, మంత్రులకు ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ‘‘కరోనా విషయంలో అంతగా భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతున్నది. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం వైరస్ సోకిన తర్వాత కూడా అత్యధిక శాతం మందిలో కనీసం వ్యాధి లక్షణాలు కూడా కనిపించడం లేదు.

వైరస్ సోకిన వారిలో 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. వారికి ఎలాంటి వైద్యం కూడా అవసరం లేదు. 15 శాతం మందిలో జలుబు, జ్వరం, దగ్గు, దమ్ము లాంటి ఐఎల్ఐ ( ILI - Influenza like illness) లక్షణాలు కనిపిస్తాయి.
 
ఐఎల్ఐ లక్షణాలున్న వారు త్వరగానే కోలుకుంటారు. మిగతా 5 శాతం మందిలో మాత్రమే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అలాంటి వారిలో సారి (SARI - Severe Acute Respiratory Illness) లక్షణాలు కనిపిస్తాయి. ఈ 5 శాతం మంది విషయంలోనే ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వీరిలోనే మరణించే వారు ఎక్కువ ఉంటారు. 
 
భారతదేశంలో 2.86 శాతం, తెలంగాణలో 2.82 శాతం మరణాల రేటు ఉంది. వారు కూడా ఇతర సీరియస్ జబ్బులు ఉన్న వారే. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత ప్రజల కదలిక పెరిగింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వివిధ మార్గాల ద్వారా రాకపోకలు పెరిగాయి. అయినప్పటికీ వైరస్ ఉన్నట్లుండి ఉధృతంగా వ్యాప్తి చెందలేదు. ఇది మంచి పరిణామం.
 
మొత్తంగా తేలేదిమిటంటే, కరోనా వైరస్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ కరోనాకు వ్యాక్సిన్, మెడిసిన్ రాలేదు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండడం అవసరం. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం అవసరం.
 
సీరియస్‌గా ఉన్న వారి విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలి. వారిని ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాలి. పాజిటివ్ గా తేలినప్పటికీ లక్షణాలు లేని వారిని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ప్రజలు కూడా లాక్ డౌన్ నిబంధనలు,కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలి. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి’’ అని సిఎం సూచించారు.
 
‘‘కొన్ని అంచనాలు ప్రకారం రాబోయే రెండు మూడు నెలల్లో దేశంలో పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు ఎక్కువైనా సరే, ఎంత మందికంటే అంతమందికి వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
 
అవసరమైన పిపిఇ కిట్లు, టెస్టు కిట్లు, మాస్కులు, బెడ్స్, వెంటిలేటర్లు, ఆసుపత్రులు అన్నీ సిద్ధంగా ఉన్నాయి’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మే నెలలో అతి పెద్ద ర్యాలీ నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు