రష్యా ప్రధానమంత్రి మిఖాయిల్ మిషుస్టిన్‌కు కరోనా సోకింది. కరోనా పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ అని తేలిందనీ, స్వీయ నిర్బంధంలో ఉంటానని మిఖాయిల్ ప్రకటించారు. కీలక అంశాల్లో అందుబాటులో ఉంటానని, ఈ మేరకు అధ్యక్షుడు పుతిన్‌కు సమాచారం ఇచ్చానని వెల్లడించారు.
రష్యాలో సాధారణంగా ఆర్థికపరమైన నిర్ణయాలను ప్రధానమంత్రి తీసుకుంటూ అధ్యక్షుడికి జవాబుదారీగా ఉంటారు. ప్రధానికి కరోనా సోకినందున ఆయనకు నయం అయ్యే వరకూ ఆ బాధ్యతలన్నీ ఇకపై ఉప ప్రధాని అయిన ఆండ్రూయ్ బెలూసోవ్ నిర్వర్తించనున్నారు. కరోనా కోరలు చాస్తున్న వేళ అధ్యక్షుడు తన సమావేశాలన్నింటినీ రద్దు చేసుకొని, వీడియో కాన్ఫెరెన్సుల ద్వారా నిర్వహిస్తున్నారు.
కాగా, మైఖైల్ మిషుస్తిన్ రష్యా దేశ ప్రధానిగా గత జనవరిలో బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రధానికి వైరస్ సోకడంతో అధికార యంత్రాంగంలోనూ ఒకింత ఆందోళన నెలకొంది. రష్యాలో ఇప్పటివరకూ 106,498 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 11,619 మంది కరోనా నుంచి కోలుకోగా.. 1,073 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రష్యాలో 93,806 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.