Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాంటీజన్ టెస్టులో నెగెటివ్ వచ్చిందా.... మళ్లీ పరీక్షలు నిర్వహించండి.. కేంద్రం

Advertiesment
యాంటీజన్ టెస్టులో నెగెటివ్ వచ్చిందా.... మళ్లీ పరీక్షలు నిర్వహించండి.. కేంద్రం
, శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (10:43 IST)
కోవిడ్ పరీక్షల్లో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ర్యాపిడ్ యాంటీజన్ పరీక్షలు చేయించుకుని, ఫలితం నెగెటివ్ వచ్చినప్పటికీ కరోనా లక్షణాలున్న అందరినీ మరోసారి పరీక్షించాలని, అందుకు విధిగా ఆర్టీ-పీసీఆర్ విధానాన్ని పాటించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. 
 
దేశంలోని అనేక రాష్ట్రాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో నెగటివ్ వచ్చిన వారిని వదిలేశారు. వారిలో లక్షణాలున్న వారికి నిబంధనల ప్రకారం ఆర్టీ-పీసీఆర్ చేయలేదని తెలుస్తోందని కేంద్రం పేర్కొంది.
 
ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం, జ్వరం లేదా దగ్గు లేదా ఊపిరి ఇబ్బంది లక్షణాల్లో ఏదైనా ఉండి యాంటీజన్ టెస్టుల్లో నెగటివ్ వచ్చినా, రెండు నుంచి మూడు రోజుల్లోనే రీటెస్ట్ చేయాలని కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. 
 
లక్షణాలుండి నెగటివ్ వచ్చిన వారు వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల్లో నూరు శాతం కచ్చితత్వం ఉండదని గుర్తు చేసింది. ఈ టెస్టుల్లో పాజిటివ్ వస్తే, వైరస్ సోకినట్టేనని, నెగటివ్ వస్తే ఆర్టీ-పీసీఆర్ తప్పనిసరని పేర్కొంది.
 
45 లక్షలు దాటిన కరోనా కేసులు
మరోవైపు, దేశంలో క‌రోనా కేసులు, మృతుల సంఖ్య అంత‌కంత‌కు పెరిగిపోతోంది. ప్ర‌తిరోజు రికార్డు స్థాయిలో కేసులు న‌మోదవుతు‌న్నాయి. మొత్తం కేసుల సంఖ్య 45 ల‌క్ష‌ల మార్కును దాటింది. గత 24 గంటల్లో దేశంలో 96,551 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45,62,415కు చేరింది.
 
గ‌త 24 గంట‌ల సమయంలో 1,209 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 76,271కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 35,42,664 మంది కోలుకున్నారు. 9,43,480 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.  
 
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షన్నర దాటిపోయింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,426 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,52,602కు పెరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ద్వారా తెలుస్తోంది. అలాగే, నిన్న 13 మంది కరోనా కారణంగా మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 940కి పెరిగింది.
 
మరోవైపు, రాష్ట్రంలో కోలుకుంటున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతుండడం గమనార్హం. నిన్న ఒక్క రోజే 2,324 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా కోరల నుంచి బయటపడిన వారి సంఖ్య 1,19,467కు చేరుకుంది. 
 
రాష్ట్రంలో ఇంకా 32,195 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరిలో 25,240 మంది ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 62,890 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20,16,461 మందికి పరీక్షలు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో కరోనా వైరస్ ఉగ్రరూపం.. 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు