రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనానికి నాంది పలికింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లకు ప్రాముఖ్యత బాగా పెరిగింది.
భారత్ వీటిని ఒక్కొక్కటి రూ.2 వేలు చొప్పున చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. అయితే సంచలనాలకు కేరాఫ్‌గా మారిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ కిట్లను మార్కెట్ ధరలో మూడో వంతుకే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కార్యాచరణ రూపొందించుకుంటోంది. వీటిని కేవలం రూ.650కే రిలయన్స్ ఇండస్ట్రీస్ అందించనుంది.
ఇటీవలే ఆ సంస్థ కొనుగోలు చేసిన దుస్తుల తయారీ సంస్థ అలోక్ ఇండస్ట్రీస్‌ను పీపీఈ తయారీదారు సంస్థగా కూడా మార్చేసింది. గుజరాత్‌లోని సిల్వస్సాలో ఉన్న అలోక్ ఇండస్ట్రీస్ తయారీ ప్లాంట్లను పీపీఈ కిట్ల తయారీ కేంద్రాలుగా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. రోజువారీగా దాదాపు లక్షకుపైగా పీపీఈ కిట్లను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పీపీఈ సూట్‌లో చేతి గ్లవ్స్, షూ కవర్స్, ఎన్95 మాస్కులు, హెడ్‌గేర్, ఫేస్ మాస్క్ ఉంటాయి.