కరోనా విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వుండాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దాదాపు 30శాతం మంచి చిన్నారుల్లో కరోనా సోకినా కూడా వ్యాధి లక్షణాలు కనిపించట్లేదని ఇటీవల కెనడాలో జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.
కెనడాకు చెందిన మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. కరోనా బారిన పడ్డ మొత్తం చిన్నారుల్లో వ్యాధి సోకినట్టు రుజువైన వారి శాతం తక్కువన్న విషయాన్ని ఈ అధ్యయనం రుజువు చేసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజల ఆరోగ్య పరంగా ఇది పెద్ద సమస్యే.. కరోనా వైరస్ తమ మధ్యే వుందనే విషయం అనేక మంది గుర్తించలేరని యూనివర్శిటీ ఆఫ్ ఆల్బర్టాలో వైద్య విద్య ఫాకల్టీ ఫిన్‌లే మెకాలిస్టర్ వ్యాఖ్యానించారు. 'ఇప్పటి వరకూ ఉన్న సమచారం ప్రకారం.. పిల్లల కంటే పెద్దల ద్వారా కరోనా వ్యాప్తి ఎక్కువగా జరుగుతోంది. కానీ కరోనా సోకిన చిన్నారుల వల్ల కొంత రిస్క్ ఉంది' అని మెకాలిస్టర్ స్పష్టం చేశారు.
కెనడా, ఆల్బర్టాల్లో మొత్తం 2463 మంది కరోనా సోకిన చిన్నారులను అధ్యయనం చేసిన అనంతరం శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. ఈ పరిణామాల దృష్ట్యా స్కూళ్లను దీర్ఘ కాలం పాటు మూసి ఉంచడం సబబేనని మెకాలిస్టర్ తెలిపారు.