కరోనా తగ్గిన తర్వాత కూడా ఇతర సమస్యలు నెలల పాటు వెంటాడుతున్నాయని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫోర్ట్ యూనివర్శిటీ అధ్యయనంలో తేలింది. తొలిసారి వైరస్ సోకి..చికిత్స పొంది ఇంటికి వెళ్లిన తర్వాత కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది..అలసట..ఆందోళన..నిరాశకు గురవుతున్నారని తేలింది.
సగానికి పైగా ఈ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తేలింది. కరోనాతో ఆసుపత్రిలో చేరిన 58 మంది రోగులపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది. అందులో కరోనా బారిన పడి కోలుకున్న వారికి పలు అవయవాల పనితీరు సక్రమంగా పనిచేయకపోవడం, ఆ సమస్య కొన్ని నెలల పాటు వేధించడం జరుగుతున్నాయని తేలింది.
ఈ అధ్యయనాన్ని ఇతర శాస్త్రవేత్తలు సమీక్షించనప్పటికీ.. సమీక్ష నిమిత్తం మెడ్‌రెక్సివ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. కరోనా బారిన పడిన అనంతరం ఎదుర్కొంటున్న శారీరకమైన ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించడంతో పాటు..ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యాక సమగ్రమైన క్లినికల్ కేర్ అవసరమని ఈ పరిశోధనలో తేలిందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన వైద్యులు తెలిపారు.
ఈ అధ్యయనంలో ఒకసారి కోవిడ్-19 సోకి...తగ్గిన అనంతరం 64 శాతం మంది శ్వాసకోశ సంబంధిత సమస్యలు..55 శాతం మంది అలసటకు గురౌతున్నారని వెల్లడైంది. ఎంఐఆర్ స్కాన్‌లో 60 శాతం మంది ఊపిరితిత్తుల సమస్యలు, 29 శాతం మంది కిడ్నీకి సంబంధించిన, 10 శాతం మందికి కాలేయంపై ప్రభావాన్ని చూపినట్లు తేలింది.