యూరప్ దేశాల్లో మహమ్మారి విలయం సృష్టిస్తుండటంతో కొన్ని దేశాలు మళ్లీ లాక్‌డౌన్ బాటపట్టాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 5.73కోట్ల మంది కరోనా బారినపడగా.. 13.67లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇంకా యూరప్ దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. ప్రతి 17సెకన్లకు ఒక కరోనా మరణం నమోదవుతుందని డబ్ల్యూహెచ్‌ఓ యూరప్ రీజినల్ డైరెక్టర్ హాన్స్ క్లూజ్ తెలిపారు.
యూరప్ దేశాల్లో కరోనా విలయం కొనసాగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యూరప్ దేశాల్లో మహమ్మారి విజృంభిస్తున్న తీరును హాన్స్ క్లూజ్ మీడియాకు వివరించారు. గత వారంలో యూరప్‌లో 29వేల కరోనా మరణాలు నమోదైనట్లు చెప్పారు.
ఈ లెక్కన కరోనా మహమ్మారి బారినపడి ప్రతి 17 సెకండ్లకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారంటూ అంచనా వేశారు. 'యూరప్‌లో గత వారం 29వేల కరోనా మరణాలు నమోదయ్యాయి. అంటే ప్రతి 17 సెకండ్లకు ఒకరు మరణిస్తున్నారు' అని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా.. గత వారంలో యూరప్‌లో కరోనా మరణాలు 18శాతం పెరిగినట్లు హాన్స్ క్లూజ్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో సుమారు 28శాతం కేసులు యూరప్ దేశాల్లోనే నమోదయ్యాయని చెప్పారు. అదే మరణాల విషయాన్ని వస్తే 26శాతం మరణాలు ఇక్కడే సంభవించాయని హాన్స్ క్లూజ్ వివరించారు.