కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ఈ వైరస్ బారినపడితే తిరిగి కోలుకోవడం కష్టమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, 12 యేళ్లలోపు, 60 యేళ్ళ పైబడిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ వైరస్ మాత్రం ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలో ఢిల్లీలో దారుణం జరిగింది. కరోనా సోకిందన్న భయంతో ఓ ఐఆర్ఎస్ అధికారి బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని ద్వారక జిల్లాలో కారులో ఓ వ్యక్తి స్పృహ లేకుండా పడి వున్నారన్న సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్టు ధ్రువీకరించారు.
బాధితుడిని ఢిల్లీకి చెందిన 56 ఏళ్ల ఐఆర్ఎస్ అధికారిగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత మృతదేహానికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగటివ్ అని రావడం గమనార్హం.
అయితే, తనకు కరోనా సోకిందన్న భయంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన వల్ల తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆత్మహత్యకు ముందు ఆయన రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.