ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రపంచ వ్యాప్తంగా పలు రకాలైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో రష్యా ముందంజలో ఉంది. అలాగే, ఆక్స్‌ఫర్ట్ యూనివర్శిటీతో పాటు.. భారత్‌లో జరగుతున్న ప్రయోగాలు కూడా తొలి రెండు దశల ట్రయల్స్ పూర్తి చేసుకున్నాయి. భారత్‌లో బయోటెక్ సంస్థ తయారుచేసే కోవ్యాగ్జిన్, జైడస్ కాడిలా వ్యాక్సిన్ జైకోవిడ్‌లు ఇప్పటికే తొలి రెండు దశల ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకోనున్నాయి. దీంతో మన దేశంలో అనుకున్న సమయం కంటే ఈ వ్యాక్సిన్ ముందుగానే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఐసీఎంఆర్ అత్యవసర ఆదేశాలు సైతం జారీచేసేందుకు సిద్ధమైపోయింది.
వ్యాక్సిన్ ట్రయల్స్ రెండు దశలను విజయవంతంగా పూర్తి చేసుకోవడం, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనా నిరోధక యాంటీ బాడీలు పెరగడం, సైడ్ ఎఫెక్ట్‌లు కూడా పెద్దగా నమోదు కాకపోవడంతో, 'ఎమర్జెన్సీ ఆథరైజేషన్' ద్వారా వ్యాక్సిన్‌ను రిలీజ్ చేసి, యువతకు ఇవ్వాలని భావిస్తున్నట్టు ఐసీఎంఆర్ ఉన్నతాధికారి ఒకరు పార్లమెంటరీ కమిటీ ముందు వెల్లడించగా, వారి నుంచి కూడా సానుకూల స్పందన వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం వ్యాక్సిన్ ట్రయల్స్ వివిధ దశల్లో ఉన్నప్పటికీ, అత్యవసరమని భావిస్తే, వెంటనే దాన్ని విడుదల చేసేందుకు సిద్ధమేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ స్వయంగా వ్యాఖ్యానించినట్టు కమిటీలోని ఓ ప్రజా ప్రతినిధి మీడియాకు తెలిపారు. సాధారణంగా వ్యాక్సిన్ మూడో దశ పరీక్షలు పూర్తయి, ఫలితాలు రావడానికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని భార్గవ చెప్పారని, అయితే, తప్పదని ప్రభుత్వం భావిస్తే, వెంటనే రిలీజ్ చేసేందుకు అభ్యంతరం లేదని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం.