ఒక వైపు మహారాష్ట్ర, దిల్లీలో కరోనావైరస్ కేసుల పెరుగుదల తగ్గు ముఖం పడుతుంటే, మరో వైపు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలలో కేసుల సంఖ్య పెరుగుతోంది.
గత కొన్ని రోజులుగా బెంగళూరు, హైదరాబాద్ నగరాలలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత రెండు రోజుల్లో బెంగళూరులో నమోదైన పాజిటివ్ కేసులు ముంబయిని మించిపోయాయి.
ముంబయిలో శనివారం నాడు 1337 పాజిటివ్ కేసులు నమోదైతే, అదే రోజు బెంగళూరులో 1533 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ముంబయిలో 73 మరణాలు చోటు చేసుకుంటే బెంగళూరులో 27 మరణాలు చోటు చేసుకున్నాయి.
హైదరాబాద్లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. శనివారం హైదరాబాద్ లో 736 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9 మరణాలు చోటు చేసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో తమిళనాడులో 3671 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 69 మరణాలు చోటు చేసుకున్నాయి. కానీ, ఇక్కడ కేసులు రెట్టింపవ్వడానికి 17 రోజుల సమయం పడుతోంది.
కర్ణాటకలో ప్రతి 9 రోజులకు కేసులు రెట్టింపు అవుతుంటే, తెలంగాణలో అది ప్రతి 10 రోజులకు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసులు రెట్టింపయ్యే సమయం 13 రోజులు కాగా, కేరళలో 18 రోజులుగా ఉంది.
బెంగళూరు, హైదరాబాద్ లో కేసులు పెరుగుతున్న తీరు చూస్తుంటే వచ్చే రెండు వారాలలో ఇన్ఫెక్షన్ పీక్ స్థాయికి చేరవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
"హైదరాబాద్లో తగినంత స్థాయిలో పరీక్షలు జరగకపోవడం పట్ల నాకు విచారంగా ఉంది. సరిగ్గా టెస్టింగ్ నిర్వహించకపోతే చాలా కేసులను కనిపెట్టలేని ప్రమాదం ఉంది. హైదరాబాద్ ఇప్పుడు ఒక సంక్లిష్ట దశలో ఉంది. బెంగళూరులో ముఖ్యంగా కిక్కిరిసిన ప్రాంతాలలో సామాజిక వ్యాప్తి జరుగుతోంది” అని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాలో ఎపిడెమియాలజిస్ట్‌గా పని చేస్తున్న డాక్టర్ గిరిధర్ బాబు చెప్పారు.
“కేసులను సత్వరమే గుర్తించకపోతే , హాస్పిటళ్లలో సీరియస్ కండిషన్లతో చేరే రోగులు ఎక్కువైపోయే అవకాశం ఉంది. రాష్ట్రాలు సత్వరమే స్పందిస్తే మరణాలు తగ్గించవచ్చు. రోగులే తమంతట తాము హాస్పిటల్ కి రావాలని ఎదురు చూస్తే ,అప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది, అని డాక్టర్ బాబు చెప్పారు.
అపోలో హాస్పిటల్లో కోవిడ్ యూనిట్ కి అధిపతిగా ఉన్న డాక్టర్ సునీత నర్రెడ్డి, డాక్టర్ బాబు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో, ఏకీభవించారు.
"మేము పడకల సంఖ్య రోజు రోజుకీ పెంచుతున్నాం. కానీ, అది సరిపోయేలా లేదు. టెస్ట్ చేయించుకోక పొతే ఇన్ఫెక్షన్ సోకిందో లేదో అర్ధం కాదు. లాక్ డౌన్ ఇన్ఫెక్షన్ లను నియంత్రించేందుకు పని చేస్తుందో లేదో తెలుసుకునేందుకు తెలంగాణ లో ప్రయోగం జరుగుతున్నట్లుగా ఉంది" అని ఆమె అన్నారు.
లాక్ డౌన్ వలన కేసులు బయట పడేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుందని చాలా మంది ఎపిడెమియోలజిస్టులు, నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
కర్ణాటక లో కఠినంగా అమలు చేసిన లాక్ డౌన్ గురించి నిపుణులు ఉదాహరణగా చెబుతున్నారు.
లాక్ డౌన్ సడలించే సమయానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలతో వచ్చిన కేసులను తట్టుకునేందుకు వైద్య వ్యవస్థ సతమతమయింది.
ముఖ్యంగా బెంగళూరులో ప్రతి రోజు కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కానీ, ఈ సంఖ్య దిల్లీ , ముంబయి , చెన్నై నగరాలలో నమోదైన కేసుల కంటే తక్కువే. తమిళనాడు నుంచి పాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్ బాబు అంటారు.
ఈ రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉండటంతో రెండవ సారి మరింత కఠినమైన లాక్ డౌన్‌ని విధించారు. "ఎప్పటికప్పుడు నియంత్రణ వ్యూహాన్ని మారుస్తూ ఉండటం వలన వైద్య వ్యవస్థ కూడా ఒకే సారి ఇబ్బడి ముబ్బడిగా వచ్చే కేసులతో సతమతమవకుండా నిజంగా చికిత్స అవసరమయ్యే వారి కోసం సేవలందించే అవకాశం ఉంటుంది”, అని ఆయన అన్నారు.
వైరస్‌తో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో పాటు, ప్రజలు కూడా అవసరమైన జాగ్రత్తలు పాటిస్తేనే వీలవుతుంది. ఈ వైరస్ ఇప్పట్లో అంతమయ్యేది కాదని, నిపుణులు స్పష్టం చేశారు.
“ముంబైలో అత్యంత పెద్ద మురికి వాడ ధారవిలో ప్రజలు చాలా మంది భయంతో పారిపోయారు, కానీ, వారి ద్వారా దక్షిణాది రాష్ట్రాలలో మారు మూల గ్రామాలకు ఇన్ఫెక్షన్ పాకింది” అని వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జయప్రకాశ్ ముళియిల్ అన్నారు.
“ధారవి లాంటి ప్రాంతాలను ఉదాహరణగా పరిశీలించడం సులభం అవుతుంది. అక్కడ ఇన్ఫెక్షన్ లను అరికట్టడానికి చాలా కృషి జరిగింది. అయినప్పటికీ కేసులు పెరుగుతూ వచ్చాయి. అయిదు వారాల క్రితం యాంటీ బాడీల కోసం ఒక సర్వే నిర్వహించారు. అక్కడున్న జనాభాలో 36 శాతం మందికి ఇన్ఫెక్షన్ సోకినట్లు ఈ సర్వేలో సోకింది. ఇది పెద్ద సంఖ్యే“ అని డాక్టర్ ముళియిల్ అన్నారు.
"ఈ పెద్ద సంఖ్య ఇప్పుడు కేవలం నెలకి ఒకటి రెండు కేసులకు మాత్రం పరిమితం అయింది. వైరస్ వ్యాప్తి తగ్గుతుందని భావించాం. వైరస్ పూర్తిగా మాయమవ్వకపోయినా కనీసం వ్యాప్తి జరగడం తగ్గుతుంది. హెర్డ్ ఇమ్మ్యూనిటి ఎలా పని చేస్తుందో చెప్పడానికి ఇది చాలా తొలి దశ కావచ్చు. ఈ రెడ్ క్లస్టర్లు గ్రీన్ క్లస్టర్లుగా ఎలా మారాయో మీకు అర్ధమై ఉంటుంది”, అని ముళియిల్ ఆయన వివరించారు.
“ధారవి నుంచి ఇన్ఫెక్షన్ ముంబయిలో ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పుడు బెంగళూరులో అదే జరుగుతోంది. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఇది వ్యాపిస్తోంది”, అని డాక్టర్ బాబు అన్నారు.
దేశంలో ప్రతి నగరంలో కేసులు పెరగవచ్చు. అయితే, మరణాల విషయంలో ప్రతి చోటా ఒకే లాంటి పరిస్థితి ఉండకపోవచ్చు.
“వైరస్ ఇన్ఫెక్షన్లో పెరుగుదల, తగ్గుదలలు కొన్నాళ్ల పాటు ఉంటాయి. దీనికి, ప్రత్యేకంగా మందులు, వ్యాక్సిన్ లేకపోవడం వలన లాక్ డౌన్ విధానాలను మార్చి మార్చి అమలు చేస్తూ, జీవితాలను కాపాడుకోవడమే మార్గం”, అని డాక్టర్ బాబు అన్నారు.
తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాల్లో ఆదివారం నుంచి యాంటిజెన్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ పరీక్ష ఫలితాలు 30 నిమిషాలలోనే వచ్చేస్తాయి. ఆర్ టి -పి సి ఆర్ టెస్ట్ ఫలితాలు రావడానికి 8 గంటలు పడుతుంది.
“మేము గత శుక్రవారం నుంచి రోజుకు 10,000 పరీక్షలు నిర్వహిస్తున్నాం. వీటిని మరింత పెంచుతాం. మేము ఆర్డర్ చేసిన టెస్టింగ్ పరికరాలను కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ కి తరలించిందనే విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆ పరికరాలు వచ్చాయి కాబట్టి టెస్టింగ్ సంఖ్య పెరిగే అవకాశం ఉంది” అని తెలంగాణ ముఖ్యమంత్రి సలహాదారు టంకశాల అశోక్ చెప్పారు.