యూపీకి చెందిన ఓ బాలుడు కరోనాను జయించాడు. భారత్‌లో ఎక్మో చికిత్సతో ప్రాణాలతో నిలిచిన వ్యక్తి ఈ బాలుడే కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. లక్నోకు చెందిన 12 ఏళ్ల బాలుడు శ్వాస సమస్యతో బాధ పడుతుండడంతో మొదట స్థానికంగా ఒక ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉన్నందున అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ కిమ్స్‌కు ఎయిర్ అంబులెన్స్‌లో తరలించారు తల్లిదండ్రులు.
పరీక్షల్లో ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నట్లు గుర్తించిన వైద్యులు వెనో వీనస్ ఎక్మో పరికరంతో రెండు నెలల పాటు కృత్రిమంగా శ్వాస అందిస్తూ.. క్రమంగా ఆరోగ్య పరిస్థితిని కుదుటపడేలా చేశారు. వైద్యుల చికిత్సతో ఊపిరితిత్తులు క్రమంగా మెరుగవడంతో.. ఎక్మో సాయాన్ని క్రమంగా నిలిపివేశారు.
దేశంలో ఎక్మో చికిత్సపై ఎక్కువ రోజుల పాటు ఉండి, ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి ఇతడేనని వైద్యులు తెలిపారు. పోషకాహారాన్ని పెంచి ఇవ్వడం, ఫిజికల్ రీహాబిలిటేషన్, అడ్వాన్స్ డ్ లంగ్ రికవరీ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.